కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల చేరికల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున హస్తం గూటికి చేరుతున్నారు. ఇంకా 16 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో హస్తం పార్టీ నిమగ్నమైంది. మొత్తానికి బీఆర్‌ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే దిశగా కార్యాచరణకు పదును పెట్టారు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీతోపాటు సీపీఐకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా కేసీఆర్ తమ పార్టీలో చేర్చుకుని.. తెలంగాణలో మరొక పార్టీకి చోటు ఉండొద్దనే విధంగా వ్యవహరించారు. అధికార మార్పిడి తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పైన సేమ్ సీన్‌ను రిపీట్ చేస్తోంది. పార్టీ ఫిరాయింపులు తప్పు అని బీఆర్‌ఎస్ అరుస్తున్న బీద అరుపులకు.. పార్టీ ఫిరాయింపులను మొదలు పెట్టింది మీరే కదా? అని కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ జనం చర్చించుకోవడం గమనార్హం.