calender_icon.png 13 October, 2024 | 2:48 PM

నీరజ్ ఆగయా

28-09-2024 12:00:00 AM

రెండు నెలల తర్వాత స్వదేశానికి n గాయంపై ఆందోళన లేదు

టార్గెట్ 2025 ప్రపంచ చాంపియన్‌షిప్

సోనెపట్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో జావెలిన్ త్రోలో రజతం సాధించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండు నెలల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టాడు. గురువారం అర్థరాత్రి భారత్‌లో అడుగుపెట్టిన నీరజ్ శుక్రవారం ఉదయం హర్యా నాలోని స్పోర్ట్స్ యునివర్సిటీలో జరిగిన ‘మిషన్ ఒలింపిక్స్ 2036’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా నీరజ్‌కు యునివర్సిటీ నుంచి ఘన స్వాగతం లభించింది. సోనెపట్‌లో ఉన్న యునివర్సిటీ దారులు మొత్తం అభిమానులతో నిండిపోగా.. ఓపెన్ టాప్ కారులో వచ్చిన నీరజ్ పారిస్‌లో తాను సాధించిన రజత పతకాన్ని అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశాడు.

అనంతరం యునివర్సిటీ ప్రాంగణ ద్వారం నుంచి అశ్వదళం ముందుండి నడవగా.. నీరజ్ కారులో వారిని అనుసరించాడు. తన తర్వాతి టార్గెట్ 2025 టోక్యోలో జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్స్ అని నీరజ్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. 

నా టార్గెట్ అదే..

నీరజ్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ ముగిసింది. నా తర్వాతి టార్గెట్ వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు. దీనికి సంబంధించిన ప్రిపరేషన్‌ను మొదలుపెట్టాల్సి ఉంది. ఒలింపిక్స్ ఎప్పుడు నా మైండ్‌లోనే ఉంటుంది.. కానీ దానికి మరో నాలుగేళ్ల సమయముంది. గాయంపై ఆందోళన లేదు. ఈ ఏడాది గాయం ఎక్కువగా ఇబ్బంది పెట్టింది.

కానీ వచ్చే సీజన్‌కు వంద శాతం ఫిట్‌గా ఉంటా.  ప్రసుతం ట్రెయినింగ్ భారత్‌లోనే.. కానీ పోటీ ప్రారంభానికి ముందు విదేశానికి వెళ్లిపోతా. ఒలింపిక్స్‌లో ఈసారి చాలా మంది అథ్లెట్లు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాలు మిస్ అయ్యారు. అంటే మన ప్రదర్శన బాగున్నట్లే.

పారాలింపిక్స్‌లోనూ మనవాళ్లు అదరగొట్టారు. వచ్చే ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో ఇంకా మంచి ప్రదర్శన చేస్తాం’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు. కార్యక్రమం అనంతరం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయను నీరజ్ మర్యాద పూర్వకంగా కలిశాడు.

గాయంతోనే బ్రస్సెల్స్‌కు..

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజతం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ ఒలింపిక్ రికార్డును బద్దలు కొడుతూ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాకు ఇది వరుసగా రెండో పతకం కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు. పారిస్ క్రీడలు అనంతరం నీరజ్ స్వదేశానికి రాకుండా బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్ ఆడేందుకు నేరుగా జర్మనీకి చేరుకున్నాడు. డైమండ్ ఫైనల్లో నీరజ్ ఎడమ చేతికి బ్యాండేజీతో కనిపించాడు. ఫైనల్లో గాయం ప్రభావం ఎక్కడా పడకుండా నీరజ్ జావెలిన్‌ను 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలవడం విశేషం.