టుర్కూ (ఫిన్లాండ్): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పావో నుర్మీ గేమ్స్‌లో పసిడి పతకం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ బరిసెను 85.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం చేజెక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కాడు. చాంపియన్‌గా నిలిచిన అనంతరం నీరజ్ మాట్లాడుతూ..‘ఈ సీజన్‌లో కాలి మడమ నొప్పి చాలా ఇబ్బంది కలిగించింది. దీనివల్ల ఎక్కువ రన్నింగ్ చేయలేకపోయా. ఒలింపిక్స్‌కు ముందు రిస్క్ వద్దనే కారణంతోనే చాలా టోర్నీలకు దూరంగా ఉన్నా.
నొప్పి తగ్గించడం కోసం చాలా మంది డాక్టర్లను కలిశా. పారిస్ క్రీడలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నా. అందులో భాగంగానే పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొన్నా. వాతావరణం చాలా బాగుంది. మ్యాచ్‌లో ఆరు త్రోలు పూర్తి స్థాయిలో వేయగలిగా. ఫెడరేషన్ కప్ టోర్నీతో పోలిస్తే ఇక్కడ నా ప్రదర్శన మరింత మెరుగ్గా అనిపించింది. తదుపరి పారిస్ డైమండ్ లీగ్ మీట్‌లో పాల్గొనబోతున్నా’ అని నీరజ్ వెల్లడించాడు. కాగా పారిస్ ఒలింపిక్స్‌కు సన్నాహకంగా భావిస్తున్న పారిస్ డైమండ్ లీగ్ మీట్ జూలై 7న జరగనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా పారిస్ విశ్వక్రీడల్లో సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు.