నేషనల్ ఫెడరేషన్ కప్
మూడేండ్ల తర్వాత సొంతగడ్డపై బల్లెం పట్టిన జావెలిన్ వీరుడు నీరజ చోప్రా పసిడి పతకంతో సత్తాచాటాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి దేశ అథ్లెటిక్స్‌లో కొత్త అధ్యాయం ప్రారంభించిన నీరజ్.. ఫెడరేషన్ కప్‌లో అదే జోరు కొనసాగించాడు. పారిస్ విశ్వక్రీడలకు ముందు అభిమానుల సమక్షంలో అదరగొట్టాడు. నాలుగో ప్రయత్నంలో బరిసెను అల్లంత దూరం విసిరిన నీరజ్.. అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. నీరజ్ రాకతో స్టేడియానికి అదనపు భద్రత అవసరం కాగా.. పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో ప్రవీణ్ చిత్రవేల్ పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు.
భువనేశ్వర్: నేషనల్ ఫెడరేషన్ కప్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. బుధవారం జావెలిన్ త్రో విభాగంలో జరిగిన ఫైనల్లో నీరజ్ జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. డీపీ మనూ (82.06 మీటర్లు), ఉత్తమ్ పాటిల్ (78.93 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు. లోకల్ బాయ్, ఆసియా గేమ్స్ రజత పతక విజేత కిషోర్ కుమార్ జెనా ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక దాదాపు మూడేళ్ల తర్వాత స్వదేశంలో ఫెడరేషన్ కప్‌లో పాల్గొనడంతో అందరి దృష్టి నీరజ్ చోప్రాపైనే నిలిచింది. 2021లో ఇదే ఫెడరేషన్ కప్‌లో నీరజ్ జావెలిన్‌ను 87.80 మీటర్ల దూరం విసిరి పసిడి దక్కించుకున్నాడు. తాజాగా ఆ రికార్డు బద్దలు కొడతాడని ఆశించినప్పటికి నిరాశే ఎదురైంది. నీరజ్ తొలి రౌండ్‌లో జావెలిన్‌ను 82 మీటర్ల దూరం మాత్రమే విసిరాడు. ఇదే సమయంలో డీపీ మనూ 82.06 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
తొలి మూడు రౌండ్లలో డీపీ మనూదే బెస్ట్‌గా నమోదైంది. అయితే నాలుగో రౌండ్‌లో ఫుంజుకున్న నీరజ్ జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి తొలిసారి ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత డీపీ మనూ నీరజ్ మార్క్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఐదో రౌండ్‌లో నీరజ్ బరిలోకి దిగలేదు. అతన్ని అందుకోవడంలో మిగతావారు విఫలం కావడంతో నీరజ్ ఖాతాలో స్వర్ణం చేరింది. ఒలింపిక్స్‌కు ముందు మే 28న చెంగ్జియాలో జరగనున్న ఈవెంట్‌లో నీరజ్ పాల్గొననున్నాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న నీరజ్ ఆ తర్వాత ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఆసియా గేమ్స్‌లోనూ స్వర్ణంతో మెరిశాడు. పురు షుల ట్రిపుల్ జంప్ విభాగంలో ప్రవీణ్ చిత్రవేల్ 16.79 మీటర్ల దూరం దూకి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మహిళల 100 మీటర్ల ఈవెంట్‌లో స్నేహ 11.63 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి నెగ్గింది. పురుషుల 100 మీటర్లలో గురిందర్‌వీర్ సింగ్ (10.35 సెకన్లు) స్వర్ణం గెలుచుకున్నాడు.
స్వదేశంలో బరిలోకి దిగడం ఆనందంగా ఉంది. ఫెడరేషన్ కప్‌లో నా ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదనేది వాస్తవం. దోహా టోర్నీ తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చా. తగినంత విశ్రాంతి తీసుకోలేదు. అందుకే నాలుగు త్రోలు మాత్రమే విసిరా. రానున్న రోజుల్లో మరిన్ని ముఖ్యమైన టోర్నీలు ఉన్నాయి. ఈ నెలఖరులో గోల్డెన్ స్పైక్ టోర్నీలో పోటీ పడాల్సి ఉంది. అన్నీటికంటే ముఖ్యమైన పారిస్ ఒలింపిక్స్ దగ్గరపడుతున్నాయి. దాంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని నిరంతరం కష్టపడుతున్నా
- నీరజ్ చోప్రా