calender_icon.png 30 October, 2024 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ నిరుద్యోగులపై దృష్టి అవసరం

07-07-2024 12:31:35 AM

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశంపై దృష్టిపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంచాయతీరాజ్ శాఖ అధికారులను కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి సచివాలయంలో శనివారం బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ యువత ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లను అలా వదిలేస్తే సమాజం ఇబ్బంది పడుతుందన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అందుబాటులోకి రావడంతో వేలాదిమంది బీటెక్ పూర్తి చేసి, నైపుణ్యాలు లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని, ఆర్థికంగా ఉన్నవారు, తోడ్పాటు అందిన వారు మాత్రం విదేశాల్లో స్థిరపడుతున్నారని తెలిపారు.

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు? వారంతా ప్రస్తుతం ఏం చేస్తున్నారో వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సాఫ్ట్ వేర్ కంపెనీలతో అనుసంధానం చేసుకొని ఉపాధి కల్పించే అంశంపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ౪ నెలల్లోనే ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు.

రైతులు ఉచితంగా ఆ పూడిక మట్టిని పొలాలకు తరలించుకున్నారు. అయినా అవి పక్కకు పెట్టి గత పది ఏళ్లలో మిషన్ భగీరథ పేరిట 25 వేల కోట్లు ఖర్చు చేయడంపై అధికారులను ఆరా తీశారు. ఆవాస గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలను సంతృప్త స్థాయిలో పూర్తి చేసేందుకు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. వాటిని పరిశీలించా లని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. కేంద్ర బడ్జెట్ చూసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు నిధులు మరల్చుకునే ప్రయత్నం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు.

గత ఐదేళ్లలో మ్యాచింగ్ గ్రాం ట్స్ వినియోగించి కేంద్ర నిధులను సాధించుకునే అంశంలో నిర్లక్ష్యం చూపారని, ఈసారి ఆ పొరపాటు జరగవద్దని సూచించా రు. మిషన్ భగీరథ పథకం పనితీరుపై ఈనెల 15వ తేదీ వరకు నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ నివేదికను అందరు ఎమ్మెల్యేలకు అందజేసి ఇంటింటికీ నీరు అందుతున్న విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదాయం సాధించి అప్పు చెల్లిస్తామని 30 వేల కోట్లు రుణం తీసుకొచ్చారని, కానీ ఆదాయం సాధించడం, అప్పు చెల్లిం చడంలో కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని డిప్యూటీ సీఎం అన్నారు. దీంతో ప్రభుత్వమే ఆ అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

గ్రామాల్లో భగీరథ నీటిని ఎంతశాతం మేరకు వినియోగిస్తున్నారనే అంశాన్ని సర్వేలో చేర్చాలని ఆదేశించారు. 60 శాతం మంది మాత్రమే మిషన్ భగీరథ నీటిని వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. మిషన్ భగీర థ నీటి నాణ్యత, ఆరోగ్యం తదితర అంశాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యం చేయాలని అధికారులను కోరారు. మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే అంశం గ్రామ సభల్లో ఒక అజెండాగా చేర్చాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి హరిత, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు దివ్య దేవరాజన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.