05-03-2025 01:39:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): పాలియేటివ్ కేర్‌పై సమా మరింత అవగాహన రావాలని, అందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. చివరి దశలో ఉన్న రోగులకు ఇంటి దగ్గరే వైద్య సేవలు అందించేందుకు ఖాజాగూడలోని ‘స్పర్శ్ హస్పీస్’కు మంగళవారం ఆయన ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లను అందజేశారు.
ఈ వాహనాలను రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ దాతల సహకారంతో సమకూర్చింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. చివరి గడియల్లో ఉన్న వ్యక్తులు అనుభవించే మానసిక బాధ అంతా ఇంతా కాదన్నారు. అలాంటి వారిపై ప్రేమ, ఆప్యాయతను చూపించడం మనిషిగా మన బాధ్యత అని చెప్పారు.
ఒక ఆసుపత్రిని నడపాలంటేనే ఎంతో కష్టమని, అలాంటిది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చివరి ఘడియల్లో ఉన్న వారికి సేవలు అందిస్తున్న “స్పర్శ్ హస్పిస్ “ సేవలు అభినందనీయమన్నారు. వీరు అందరికీ స్ఫూర్తి దాయకమని, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పారు.
ఈ కేంద్రానికి ఉచితంగా నీటిని సరఫరా చేస్తామని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు కావాలని, ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలియేటివ్ కేర్ సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి వెంట నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.