కోటి కోసం నెలకు ఎంత? ఎన్ని ఏండ్లు?
మీరు కోటి రూపాయల నిధిని 10 ఏండ్లు, 15 ఏండ్లు, 20 ఏండ్లు, 25 ఏండ్లలో సాధించాలంటే నెలకు ఎంత పెట్టుబడి చేయాలో తెలుసుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ 12 శాతం వార్షిక రాబడి ఇస్తుందన్న అంచనా ఆధారంగా మీరు వివిధ కాలపరిమితుల్లో లక్ష్య సాధనకు ప్రతీ నెలా ఎంత పెట్టుబడి చేయాలో లెక్కించుకోవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్ రాబడులకు ఎటువంటి గ్యారంటీ ఉండదు. గతంలో ఫండ్స్ ఇచ్చిన రాబడుల ఆధారంగా మాత్రమే ఇక్కడ లెక్కించడం జరిగింది. తక్కువకాలంలో కోటి కావాలంటే నెలకు ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి చేయాల్సి ఉంటుంది.
నెలకు మ్యూచువల్ ఫండ్స్ సిప్‌ల ద్వారా రూ.44,640 చొప్పున 10 ఏండ్ల పూర్తికాలం ఇన్వెస్ట్‌చేస్తే (12 శాతం వార్షిక రాబడి) రూ.కోటి నిధి సాధ్యపడుతుంది. అదే 15 ఏండ్లకైతే నెలకు రూ. 21,020 చొప్పున పెట్టుబడి చేయాలి. మరో ఐదేండ్లు కాలపరిమితిని పెంచుకుంటే మీ నెలవారీ పెట్టుబడి మొత్తం గణనీయంగా తగ్గిపోతుంది. నెలకు రూ. 10,880 చొప్పున సిప్‌ల్లో మదుపు చేయగలిగితే రూ. 1 కోటి నిధి 20 ఏండ్లలో సాధ్యపడుతుంది. అదే 25 ఏండ్లకైతే నెలకు రూ. 5,880 చొప్పున మదుపుచేస్తే చాలు. మీరు ఆదా చేసిన దీర్ఘకాలంలో ఫండ్ మంచి పనితీరును ప్రదర్శిస్తే మరింత త్వరితంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.
సిప్‌లతో ఆర్థిక క్రమశిక్షణ
రిటైర్‌మెంట్ ఫండ్, కొత్త గృహం కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ అత్యంత అనువైనవని ఫైనాన్షియల్ నిపుణులు సూచిస్తుంటారు. అవి చేసే పెట్టుబడులపై ఆర్జించే లాభాలను తిరిగి పెట్టుబడి చేసి అదనపు రాబడుల్ని తీసుకురావడం ద్వారా మీ డబ్బును వృద్ధి చేస్తాయి. దీర్ఘకాలానికి వీటిలో పెట్టుబడి చేస్తేనే ఈ ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్ క్రమశిక్షణతో పెట్టుబడి చేసే అలవాటును కూడా ఇన్వెస్టర్లకు అలవరుస్తాయి. అందుకోసం ఏర్పాటైనవే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. సంపద సృష్టికి వీటిలో ప్రతీ నెలా కొంత పొదుపును పెట్టుబడిచేయడం అలవాటు అవుతుంది.
ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి?
సిప్ పెట్టుబడుల ద్వారా రూ.1 కోటి సమకూరాలంటే మూడు ముఖ్యమైన అంశాలను ముందు తెలుసుకోవాలి. మీరు మదుపు చేసే ఫండ్ ఇచ్చే రాబడి ఎంత? మీ లక్ష్యాన్ని ఎంతకాలంలో చేరాలనుకుంటున్నారు? మీరు ఎంత రిస్క్ తీసుకుంటారు? అనే అంశాలు ప్రధానమైనవి. డెట్ ఫండ్స్‌కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువ. అందుకే ఈక్విటీ ఫండ్స్ దీర్ఘకాలిక పెట్టుబడులకే సరిపోతాయి. కనీసం ఏడేండ్ల కాలపరిమితికి ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం మంచిదని ఫండ్ విశ్లేషకులు సూచిస్తుంటారు. మీరు ఎంత దీర్ఘకాలం పెట్టుబడి చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల రిస్క్ అంతగా తగ్గిపోతుంది. మీరు దీర్ఘకాలానికి పెట్టుబడి చేస్తున్నపుడు, కొద్ది సంవత్సరాల్లో తక్కువ రాబడి లేదా ప్రతికూల రాబడులు రావొచ్చు. మరికొద్ది ఏండ్లు గణనీయమైన రాబడి రావచ్చు. కానీ పెట్టుబడి మొత్తం కాలానికి చూసుకుంటే సగటు రాబడి పెద్ద మొత్తమే ఉంటుంది. ఎంత దీర్ఘకాలం సిప్‌ల్లో ఉంటే అంతగా రాబడులు పెరుగుతాయి.
ఎందులో పెట్టుబడి చేయాలి?
రూ.1 కోటి మొత్తాన్ని సమకూర్చుకోవడం మీరు ఎక్కడ ఇన్వెస్ట్‌చేసినా రాత్రికి రాత్రే సాధ్యమయ్యేది కాదు. దానికి సమయం పడుతుంది. నిర్దిష్ఠ కాలపరిమితి ఉంటుంది. మీరు పొదుపు చేయగలిగే మొత్తం, ఎంతకాలంలో లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నారో నిర్దేశించుకోవడం ఇందుకు ప్రధానం. అలాగే లక్ష్య సాధనకు క్రమశిక్షణ అత్యంత అవసరం. క్రమంగా పెట్టుబడి చేస్తుండాలి. ఇటువంటి క్రమ పెట్టుబడులకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అనువైనవి. ఇవి చిన్న మొత్తంలో పొదుపుతో పెట్టుబడుల్ని ప్రారంభించడానికి వీలు కల్పిస్తాయి. దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సమకూర్చిపెడతాయి. ఉదాహరణకు మీరు నెలకు రూ. 1000 చొప్పున సిప్‌లో మదుపుచేసినా, ఆ మ్యూచువల్ ఫండ్ 12 శాతం వార్షిక రాబడినిస్తే పదేండ్లలో రూ.2.2 లక్షలు అందిస్తుంది.