calender_icon.png 2 November, 2024 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ అప్పుడలా.. ఇప్పుడిలా!

21-07-2024 01:31:49 AM

  1. పరీక్షలో అవకతవకలను నిర్ధారిస్తున్న పరిణామాలు
  2. రీటెస్ట్ ఫలితాల్లో డీలా పడిన టాపర్లు
  3. సెంటర్లవారీ రిజల్ట్స్‌లోనూ అసమానతలు

న్యూఢిల్లీ, జూలై 20: నీట్ రీటెస్ట్ ఫలితాలు గమనిస్తే పరీక్షల్లో అవకతవకలు జరిగాయని నిర్ధారణ అవుతోంది. హర్యానాలోని ఓ నీట్ కేంద్రంలో గతంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులు 720కి గాను 720 మార్కులు సాధించగా.. రీటెస్ట్‌కు ఫలితాల్లో అత్యధిక స్కోర్ 682 కావడం అనుమానాలకు దారితీస్తోంది. ఎన్టీయే నగరాలవారీగా ప్రకటించిన ఫలితాల్లోనూ ఇదే విషయం వెల్లడవుతోంది. హర్యానా బహదూర్‌గఢ్‌లోని హర్‌దయాల్ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 494 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వీరిలో ఒకే అభ్యర్థి 682 స్కోర్ సాధించగా మరో 13 మంది 600కుపైగా స్కోర్ చేయగలిగారు. 

రీటెస్ట్‌కు గైర్హాజరు

నీట్ తొలిసారి ప్రకటించిన ఫలితాలను చూస్తే హర్యానాలో ఆరుగురు అభ్యర్థులు 100 శాతం మార్కులను సాధించారు. మరో ఇద్దరు 720కి గాను 719, 718 మార్కులు పొందారు. కొన్నేళ్లుగా ఈ స్థాయి మార్కులు ఇంతమందికి రాకపోవడంతో నీట్‌పై వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ఎన్టీయే గ్రేస్ మార్కులు కలపడం వల్ల అధిక మార్కులు వచ్చాయని వివరించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని గ్రేస్ మార్కులను రద్దు చేసి, 1,563 మంది అభ్యర్థులకు రీటెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. వీరిలో 800 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరుకావడం గమనార్హం. అనంతరం పరీక్షా కేంద్రం, నగరాల వారీగా ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రాల్లో అవకతవ కలు జరిగాయా లేదా అన్నది నిర్ధారించేందుకు ఈ మేరకు నిర్దేశించింది. 

సెంటర్ల వారీగా తేడాలు

బీహార్ హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్, గుజరాత్ గోద్రాలోని జలరామ్ సెంటర్లపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ పేపర్ లీక్ కేసులో అరెస్టయ్యారు. ఈ కేంద్రంలో 701 మంది పరీక్షకు హాజరుకాగా అత్యధికంగా 700 కంటే తక్కువే వచ్చాయి. ఏడుగురికి 650 కంటే ఎక్కువ, 23 మందికి 600 కంటే ఎక్కువ వచ్చాయి. జలరామ్ స్కూల్‌లో 1,838 మంది హాజరు కాగా అత్యధిక స్కోర్ 700 కన్నా ఎక్కవగా నమోదైంది. ఐదుగురికి 650 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈ సెంటర్లలో అనుమానాస్పద ఫలితాలు రానప్పటికీ అహ్మదాబాద్‌లోని ఓ కేంద్రంలో ఫలితాలు విరుద్ధంగా ఉన్నాయి. 676 మంది విద్యార్థుల్లో 12 మందికి 700కుపైన మార్కులు వచ్చాయి.

సుప్రీం కోర్టు కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. నీట్ కోచింగ్‌కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ సికార్ జిల్లాలో అభ్యర్థులకు భారీగా మార్కులు వచ్చాయి. 149 మందికి 700కుపైగా మార్కులు రాగా 2,037 మంది 650కిపైగా స్కోర్ సాధించారు. దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో మార్కులు సాధించిన మొదటి 50 పరీక్షా కేంద్రాల్లో 29 సికార్ జిల్లాలోనే ఉన్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కేంద్రంలో పరీక్ష రాసిన 2వేల మంది అభ్యర్థుల్లో 112 మందికి 700కుపైగా మార్కులు వచ్చాయి. మరో 112 మంది 650కిపైగా మార్కులు సాధించారు. ఈ అసాధారణ ఫలితాలు టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒకే జిల్లాలో ఇంతమం ది ఆ స్థాయిలో మార్కులు సాధించడంతో వారిలో అనుమానాలు చెలరేగాయి.