- గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులపై విరిగిన లాఠీ
- పోలీసుల నిర్బంధంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ..
- అశోక్‌నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్ పరిసరాలు
- 16 మంది అభ్యర్థుల అరెస్ట్
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు, పోలీసుల లాఠీ చార్జీలు, అరెస్టులతో అశోక్‌నగర్ అట్టుడుకింది. జీవో 29ను రద్దు చేయాలని, క్వాలిఫైడ్ అభ్యర్థుల సంఖ్య పెరగడంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసు దమనకాండ కొనసాగింది.
గురువారం మధ్యాహ్నం తర్వాత అశోక్‌నగర్ కేంద్రంగా గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు లాఠీలు ఝులిపించారు. 16 మంది గ్రూప్ 1 అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దుశ్చర్యను ఖండించిన బీఆర్‌ఎస్, బీజేపీ నిరుద్యోగుల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు.
అవసరమైతే కేంద్రమంత్రి పదవిని పక్కనబెట్టి అశోక్‌నగర్‌కు వెళ్తానని బండి సంజయ్ మీడియా సమావేశంలో వెల్లడించడంతో అప్రమత్తమైన పోలీసులు అశోక్‌నగర్, చిక్కడపల్లి, సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్, గోల్కొండ క్రాస్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు పారామిలటరీ బలగాలతో పహారా కాశారు.
జీవో 29తో మొదలు..
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుందని.. దీన్ని రద్దు చేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 55 ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
అలాగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 31,382 మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా ఇటీవల సీఎస్ శాంతి కుమారి 34,383 మంది మెయిన్స్ పరీక్షకు హజరవుతారని ప్రకటించారు. దీంతో క్వాలిఫై అయిన అభ్యర్థుల కంటే అదనంగా చేరిన 3,001 మందిపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
జీవో 29ను రద్దు చేసి కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను విడుదల చేసి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిగా, అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో వారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 21వ తేదీన విచారణ చేపట్టనుంది. అదే రోజు గ్రూప్ 1 మెయిన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనలను ఉధృతం చేసే అవకాశం ఉండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.