- పోలీస్, టీజీన్యాబ్‌తో కలిసి తనిఖీలు
- ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30(విజయక్రాంతి): న్యూఇయర్‌కు ఆహ్వా పలుకుతూ నిర్వహించుకునే వేడుకలపై ఎక్సైజ్ నిఘా పెడుతోంది. డిసెంబర్ 31 రాత్రి నుంచి ఆరంభమయ్యే ఈ వేడుకలలో ఎన్డీపీ(నాన్ డ్యూటీ పెయిడ్) మద్యం, డ్రగ్స్, గంజాయి వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యాన్ని వినియోగించినా, మత్తు పదార్థాలు సేవించినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈమేరకు నగరంలో జరిగే నూతన సంవత్సర వేడుకలలో తనిఖీలు నిర్వహిం ఎక్సైజ్ శాఖ 42ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
పోలీస్, టీజీన్యాబ్‌తో కలిసి ఈ బృందాలు డిసెంబర్ 31, జనవరి 1న తనిఖీలు నిర్వహిస్తాయి. అనుమతులు లేని వేడుకలపై దృష్టి సారిస్తూనే.. అనుమతులు ఉన్న చోటా తనిఖీలు నిర్వహిస్తారు. పబ్‌లు, ఫంక్షన్‌హాళ్లు ఇతర వేడుకల్లో అక్రమ మద్యం వినియోగంపై తనిఖీలు చేస్తారు. అక్రమ మద్యాన్ని వినియోగిస్తే ఫంక్షన్‌హాళ్లను బ్లాక్ లిస్టులో పెట్టడం, పబ్‌ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అయితే డిసెంబర్ 31, జనవరి 1న వైన్స్‌కు అర్థరాత్రి 12గంటల వరకు బార్లు, పబ్‌లకు అనుమతులివ్వడం గమనార్హం. వేడుకల్లో డ్రగ్స్, ఎన్డీపీ మద్యాన్ని వినియోగించవద్దని, తెలంగాణ మద్యాన్నే వినియోగించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని హోటళ్లు, పబ్బులు, రెస్టారెంట్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.