- 40 నుంచి 45 సీట్లు గెలిచే అవకాశం
- అధికార ఇండియా కూటమికి ఓటమే
- మ్యాట్రిజ్ ఏజెన్సీ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 11: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భారీ విజయాన్ని నమోదు చేస్తుందని ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 40 నుంచి 45 సీట్లు ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని మ్యాట్రిజ్ ఏజెన్సీ సర్వేలో తేలింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇండియా కూటమి కేవలం 18 నుంచి 25 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది.
జార్ఖండ్ రాజకీయాల్లో రెండు మూడేళ్లుగా అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోపణలతో సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ అరెస్ట్ జైలుకు వెళ్లారు. అనంతరం బెయిల్‌పై తిరిగి బాధ్యతలు చేపట్టారు. హేమంత్ జైలులో ఉన్నంతకాలం సీఎంగా వ్యవహరించిన జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఇది అధికార కూటమి విజయంపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు సర్వే తెలిపింది.
గిరిజన, చొరబాటు సమస్యలపై దృష్టి
గత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ఎన్డీయేకు మరింత ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ సీట్లే గెలుపొందినా విజయంపై పార్టీ ధీమాగా ఉంది. 2019లో ఎన్డీయే 14 ఎంపీ సీట్లకు గాను 13 గెలుచుకోగా.. 2024లో 9 మాత్రమే గెలుచుకుంది. ఇండియా కూటమి 5 స్థానాల్లో విజయం సాధించింది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జార్ఖండ్‌లోని గిరిజన సమస్యలపై బీజేపీ దృష్టి సారించింది. బంగ్లా అక్రమ వలసలు, జనాభా పెరుగుదల, హిందువుల ఓట్లు పెంచేందుకు రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు తదితర కీలక అంశాలపై హామీలివ్వడంపై బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ కారణాలన్నీ ఎన్డీయే కూటమి గెలుపునకు సహకరిస్తాయని సర్వే వెల్లడించింది.
అత్యధిక స్థానాల్లో బీజేపీ పోటీ
జార్ఖండ్‌లో అధికార ఇండియా కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ ఉన్నాయి. ప్రతిపక్ష ఎన్డీయే కూటమిలో బీజేపీ, ఏజేఎస్‌యూ, జేడీయూ, ఎల్జేపీ ఉన్నాయి. ఎన్డీయేలో సీట్ షేరింగ్‌లో భాగంగా 68 స్థానాల్లో బీజేపీ, 10 స్థానాల్లో ఏజేఎస్‌యూ, 2 స్థానాల్లో జేడీయూ, ఎల్జేపీ ఒక సీటులో పోటీ చేస్తోంది. ఇండియా కూటమిలో జేఎంఎం 43 సీట్లు, కాంగ్రెస్ 30 సీట్లు, ఆర్జేడీ 6 స్థానాల్లో పోటీ చేస్తుండగా 3 సీట్లను వామపక్షాలకు కేటాయించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్డీయేలో బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందగా.. ఏజేఎస్‌యూ 2 స్థానాలు గెలుచుకుంది. మాజీ సీఎం బాబులాల్ మరాండీ నేతృత్వంలోని జీవీఎం(పీ) 3 స్థానాలు దక్కించుకుంది. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మొదటి దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది.