calender_icon.png 29 April, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత మహిళలకు అండగా ఎన్‌సీడబ్ల్యూ

29-04-2025 12:09:21 AM

  1. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వాల లక్ష్యం
  2. మహిళల హక్కులు, చట్టాలపై సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలి
  3. పెండింగ్‌లో ఉన్న 30కేసులకు పరిష్కారం
  4. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయరహత్కర్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : బాధిత మహిళలకు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) అండగా నిలుస్తుందని ఆ కమిషన్ ఛైర్‌పర్సన్ విజయరహత్కర్ అన్నారు. సోమవారం బేగంపేట టూరిజం ప్లాజా సమగం హాల్‌లో  జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘మహిళా జన్ సున్వాయి’ బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ ల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయరహత్కర్ మాట్లాడుతూ బాధితుల నుంచి 60 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయని, మహిళలు అన్ని రంగాల్లో  రాణించాలన్నదే ప్రభుత్వాల లక్ష్యమని చెప్పారు. బాధిత మహిళల సమస్యలను తెలుసుకునేందుకు మహిళా కమిషన్ నేరుగా వారి దగ్గరికే వస్తోందని తెలిపారు.

ప్రతీ నెలా 4రాష్ట్రాల్లో బహిరంగ విచారణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మహిళలపై గృహహింస కేసులు, సైబర్‌నేరాలు, ఆన్‌లైన్ వేధింపులు, అత్యాచారాలు తదితర కేసులు కమిషన్ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో 2022 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న 30కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేశామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు మహిళల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను నివేదిక రూపంలో తమకు ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళల హక్కులు, చట్టాలపై సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ రాష్ట్ర ఛైర్‌పర్సన్ శారద నేరెళ్ల, మహిళా సంక్షేమ శాఖ సంచాలకులు క్రాంతి వెస్లీ, అడిషనల్ కమిషనర్ ఆఫ్ క్రైమ్స్ విశ్వప్రసాద్, అదనపు కలెక్టర్ జి.ముకుందరెడ్డి, డీసీపీ లావణ్య, జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆశన్న, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘా లు తదితరులు పల్గొన్నారు.