హైదరాబాద్, నవంబర్ 7: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్‌ఫ్రా కంపెనీ ఎన్‌సీసీ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రెట్టింపునకు పైగా పెరిగి రూ. 162.96 కోట్లకు చేరింది. నిరుడు క్యూ2లో కంపెనీ రూ. 77.34 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది.
ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 4,746 కోట్ల నుంచి రూ. 5,224 కోట్లకు పెరిగినట్లు ఎన్‌సీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్యూ2లో ఇబిటా సైతం రూ. 303.74 కోట్ల నుంచి రూ. 442.95 కోట్లకు చేరింది.
స్టాండెలోన్ ప్రాతిపదికన కంపెనీ టర్నోవర్ రూ. 4,311.68 కోట్ల నుంచి రూ. 4,480 కోట్లకు పెరగ్గా. నికరలాభం రూ. 69 కోట్ల నుంచి రూ. 160 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ద్వితీయ త్రైమాసికంలో రూ.4,760 విలువైన ఆర్డర్లు సంపాదించామని, దీంతో తమ ఆర్డర్ బుక్ రూ. 52,370 కోట్లకు చేరిందని ఎన్‌సీసీ వివరించింది.