- ప్రత్యేక అధికారుల ఆకస్మిక తనిఖీలు
- ఇప్పటికే కలెక్టర్‌కు చేరిన నివేదిక
- తక్కువ మార్కులు వచ్చిన 45మంది వార్డెన్లు, ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు!
- మరో రెండురోజుల పాటు కొనసాగనున్న తనిఖీలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని 160 హాస్టళ్లు, గురుకులాల్లో తనిఖీలు చేపట్టేందుకు ఈనెల 23న 80మంది ప్రత్యేకాధికారులను నియమించారు. వీరిలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఇతర అధికారులున్నారు. ఒక్కొక్కరికి రెండు చొప్పున వసతి గృహాలను కేటాయించగా.. వారు ఆయా హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కలెక్టర్ సూచనల మేర కు ఆయా హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపై మార్కులు వేసి రెండు రోజుల్లో కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. కాగా కలెక్టర్ కూడా అదేరోజు మల్లేపల్లిలోని మైనార్టీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతీవారం ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన విద్యా సంస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
షోకాజ్ నోటీసుల జారీ..!
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో తనిఖీలు చేసిన అధికారులు ఆయా హాస్టళ్లు, గురుకులాల్లోని పరిసరాల పరిశుభ్రత, వంటగది, సరుకులు, ఇటీవల పెరిగన మెస్ చార్జీల ప్రకారం భోజనం, విద్యార్థుల గదులు, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. వాటి ఆధారంగా ఆయా విద్యాసం స్థలకు మార్కులు కేటాయించి కలెక్టర్‌కు నివేదిక అందించారు.
పత్యేకాధికారులు వేసిన మార్కులను పరిశీలించిన కలెక్టర్ 75మార్కుల కంటే తక్కువ వచ్చిన వారికి షోకాజ్ నోటీసులు అందజేయాలని ఆదేశించారు. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా 45మంది హాస్టల్ వార్డెన్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.
వీరిలో ఎస్సీ సంక్షేమ శాఖలో 10, బీసీ సంక్షేమ శాఖలో 18, గిరిజన సంక్షేమ శాఖలో 10, మైనార్టీ సంక్షేమ శాఖలో ఏడుగురికిషోకాజ్‌నోటీసులు వచ్చినట్లు సమాచారం.కాగా పలు హాస్టళ్లలో ఇటీవల పెరిగిన మెస్‌చార్జీలకు తగినట్లు మెనూ ప్రకారం భోజనం వడ్డించలేదని, ఆహార నాణ్యత పాటించలేదని ప్రత్యేకాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
మరో రెండు రోజులు కూడా తనిఖీలు జరిగే అవకాశముంది. తాము అన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి మెమోలు ఇవ్వకుండా నేరుగా షోకాజ్ నోటీసులు జారీ చే యడంపై పలువురు వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు.
ఎప్పుడు ఏ అధికారి వస్తారోనని..
కలెక్టర్ అనుదీప్ తీసుకున్న చర్యలతో తనిఖీలకు ఎప్పుడు ఏ అధికారి వస్తారోనని వసతిగృహాల వార్డెన్లు, గురుకులాల ప్రిన్సిపాల్స్‌లో ఆందోళన నెలకొంది. అయితే పలు విద్యాసంస్థల్లో అవసరమైన పనులకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఏ సమస్య వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.