తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'నెట్‌ఫ్లిక్స్' డాక్యుమెంటరీ విడుదలను నటుడు ధనుష్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నటి నయనతార బహిరంగ లేఖ రాయడం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. నయనతార జీవితం, కెరీర్, వివాహం గురించి వివరించే డాక్యుమెంటరీ, ఆమె కెరీర్‌లో కీలకమైన ప్రాజెక్ట్ అయిన 'నానుమ్ రౌడీ ధాన్' చిత్రంలోని కంటెంట్‌ను ఉపయోగించడానికి ధనుష్ అనుమతులు ఇవ్వడానికి నిరాకరించడం వల్ల అడ్డంకులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. నయనతార 'బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ నవంబర్ 18న విడుదల కానుంది.
డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా కొన్ని క్లిప్‌లను ఉపయోగించినందుకు నష్టపరిహారం కోరుతూ ధనుష్ నయనతారకు లీగల్ నోటీసు పంపిన తర్వాత ఈ చర్య జరిగింది. డాక్యుమెంటరీ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) కోసం రెండేళ్లుగా చేస్తున్న పోరాటంపై నయనతార నిరాశ వ్యక్తం చేసింది. సినిమాలోని పాటలు, విజువల్స్ లేదా ఫోటోగ్రాఫ్‌ల వినియోగాన్ని అనుమతించడానికి ధనుష్ నిరాకరించడం చట్టపరమైన లేదా వ్యాపార కారణాల కంటే వ్యక్తిగత మనోవేదన కలిగిందని ఆమె ఆరోపించింది. చివరకు ఆశలు వదులుకున్నామని, మీరు ఒప్పుకొకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రీ ఎడిట్ చేశామని చెప్పారు. నానుమ్ రౌడీ ధాన్ చిత్రం ఈనాటికీ అభిమానులచే ఆదరించబడిన బ్లాక్ బస్టర్ అని అభివర్ణించింది.
ధనుష్‌ను ఉద్దేశించి నయనతార మాట్లాడుతూ, నా జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నా కెరీర్ లో ఎంతో కీలకమైన 'నానున్ రౌడీ దాన్' లేకపోవడం చాలా బాధకరం. ఈ చిత్రంలోని పాటలు, విజువల్స్ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో నా హృదయాన్ని ముక్కలు చేసిందని నయనతార పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి వచ్చేందుకు తాను ఎంతో పోరాటం చేశానని చెప్పిన నయనతార తన వృత్తిని, తన అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.