calender_icon.png 24 September, 2024 | 10:02 PM

2026 నాటికి నక్సల్స్ అంతం

21-09-2024 02:34:23 AM

నక్సల్ సిద్ధాంతం కూడా లేకుండా చేస్తాం

ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు జిల్లాకే నక్సల్స్ పరిమితం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలో కన్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా తుడిచి పెట్టేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలిజంతోపాటు నక్సలైట్ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని కూడా దేశం నుంచి 2026 మార్చి 31వ తేదీ నాటికి పారద్రోలాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయించారని, తాము అంతకంటే ముందుగానే ఆ లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో నక్సల్స్ హింసలో నష్టపోయిన కుటుంబాల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.

ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని నక్సలైట్లకు పిలుపునిచ్చారు. నక్సలైట్ల ఏరివేతలో భద్రతా బలగాలు అద్భుత విజయం సాధిస్తున్నాయని ప్రశంసించారు. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉండే ఛత్తీస్‌గఢ్ జిల్లాలో ప్రస్తుతం నాలుగు జిల్లాలకే దానిని పరిమితం చేసినట్టు తెలిపారు. దేశంలో పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఆంధ్రప్రదేశ్) వరకు మరోసారి కారిడార్ నిర్మించుకొనేందుకు నక్సల్స్ చేసిన ప్రయత్నాన్ని కేంద్రం ధ్వంసం చేసిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ హింసవల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోంశాఖ త్వరలోనే ఓ సంక్షేమ పథకం ప్రారంభిస్తుందని వెల్లడించారు. 

ఈ ఏడాది ఇప్పటికే 164 మంది నక్సల్స్ మృతి

దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దండకారణ్యాన్ని జల్లెడ పడుతోంది. ఈ ఏడాది ఇప్పటికే భద్రతా దళాల ఎన్‌కౌంటర్లలో 164 మంది నక్సల్స్ మరణించారు. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ (సాప్ట్) నివేదిక ప్రకారం ఈ 164 మందిలో 142 మంది ఛత్తీస్‌గఢ్‌లోనే చనిపోయారు. 90 శాతం ఎన్‌కౌంటర్లు కైరాంగఢ్  జిల్లాల్లోనే జరిగాయి.