హైదరాబాద్,(విజయక్రాంతి): ఛత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం భీకర ఎదురు కాల్పులు జరిగాయి. బస్తర్ పరిధిలో నారాయాణపూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ ప్రాంతాల భద్రతా బలగాలు ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు కూంబింగ్ కు వెళ్లాయి. ఉదయం నుంచి మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కుంబింగ్ లో డీఆర్జీ, ఎస్టీఎస్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. కుంబింగ్ వెళ్లిన భద్రతా బలగాలకు నక్సలైట్లు తారసపడడంతో కాల్పులు జరిపి 12 మంది నక్సలైట్లను మట్టుబెట్టారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఇప్పటివరకు యూనిఫారం ధరించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి సుందర్‌రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.