26-02-2025 12:00:00 AM
యాభై ఐదు సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్, కళాశాల ఏ మాత్రం పురోగతి లేకుండా ఉంది. అప్పుడు మొదలుపెట్టిన బిఎన్‌వైఎస్ కోర్సు తప్ప కొత్తగా, డిప్లొమా, పీజీ కోర్సులు లేవు. భారతదేశంలోనే పురాతనమైన ఈ వైద్య కళాశాల పాలకుల నిర్లక్ష్యంతో ఎదుగూ బొదుగూ లేకుండా పోవడం దురదృష్టకరం. ఎప్పుడూ పేషెంట్స్ తాకిడితో రద్దీగా ఉంటున్నది. అరకొర డాక్టర్లు, నిపుణులైన ట్రీట్మెంట్ అటెండర్లు, పర్యవేక్షకులు లేకుండా కేవలం ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌తో కాలం గడుపుతున్నారు. తొంభై శాతం డాక్టర్లు, సహాయ సిబ్బంది పదవీ విరమణ చేయడంతో ఆస్పత్రిని భారంగా నెట్టుకొస్తున్నారు.
ప్రభుత్వ గాంధీ నేచర్ క్యూర్ కళాశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను చేర్చడానికి, పరిశోధన సంస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో నేచురోపతి ఆసుపత్రుల స్థాపన కోసం ప్రభుత్వం చొరవ చూపాలి. సహజ పద్ధతుల ద్వారా వారి శ్రేయస్సుపై నియంత్రణను తిరిగి పొందేందుకు వ్యక్తులను శక్తివంతం చేయడంపై దృష్టి సారించిన ప్రకృతి వైద్యాన్ని ఒక సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ విధానంగా పేర్కొనాలి. వ్యక్తిగత సంరక్షణ, సంప్రదాయ వైద్యానికి ప్రత్యామ్నాయాలను కోరుకునే వారికి ఇదొక వరప్రదాయిని.
ఈ కారణంగానే ప్రకృతి వైద్యంపై ప్రజలలో ఆసక్తి పెరుగుతున్నది. ప్రభుత్వ నేచర్ క్యూర్ కళాశాలకు విపరీతమైన డిమాండ్ ఉంటున్నది. మరోవైపు శాస్త్రీయ అవగాహన, అర్హత లేని అభ్యాసకుల నుంచి ప్రకృతి వైద్యానికి పొంది వున్న ముప్పును ప్రభుత్వం గుర్తించాలి. ఇకనైనా, జిల్లా స్థాయిలో నేచురోపతి ఆసుపత్రుల స్థాపనకు వనరులను కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా నేచురోపతి ఆసుపత్రుల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు కావలసిన అన్ని చర్యలూ చేపట్టాలని రెసిడెంట్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్‌కు ఆస్కారం లేని సహజ సిద్ధమైన ప్రకృతి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయవలసిన అవసరాన్ని రాజకీయ నాయకులు కూడా గుర్తించాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాలి. పిల్లలను జంక్ ఫుడ్, ఆరోగ్యానికి హానికరమైన శీతల పానీయాలు, మాదక ద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంచడం ద్వారా ప్రకృతి జీవన విధానానికి అలవాటు చేయాలి. ప్రకృతి వైద్యం ప్రజలకు చేరువ కావడానికి మూడు లక్షల మందికి ఒక వెల్‌నెస్ సెంటర్ చొప్పున ఏర్పాటు చేయాలి.
- డా. యం. అఖిల మిత్ర