calender_icon.png 24 October, 2024 | 4:07 AM

ప్రకృతే నేర్పుతుంది!

11-06-2024 12:00:00 AM

ఒక చిత్రం ఎన్నో భావాలను పలికిస్తుంది. మరెందరినో కదిలిస్తుంది. మనల్ని చైతన్య పరుస్తుంది. అదే చిత్రకారుల మనసులోతుల్లోని ఆలోచనలను కాన్వాస్‌పై ఆవిష్కరించేలా ప్రేరేపిస్తుంది. కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు కాదేదీ కళకు అనర్హం అంటూ తమ ప్రతిభను చాటుకుంటున్న వారు ఎందరో మన కండ్ల ముందు ఉన్నారు. వారిలో ప్రముఖ ఆర్టిస్టు, రిటైర్డ్ ప్రొఫెసర్ అంజనీ రెడ్డిగారు.

మన చుట్టూ ఉండే ప్రకృతి, సంప్రదాయం, జీవన విధానమే ఆమె చిత్రకళకు కథా వస్తువు. ఆర్ట్ అనేది గుండె లోతుల్లో నుంచి పుట్టుకొచ్చే సహజమైన కళ. దాన్ని ప్రత్యేకంగా సృష్టించలేం. ప్రకృతిని ఆస్వాదిస్తే కానీ దాని మాధుర్యం అర్థం కాదు. రంగుల ప్రపంచంలో తన కాన్వాస్‌లో ఒదిగిపోయిన చిత్రాలెన్నో.. మూడు దశాబ్దాలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్‌లు నిర్వహించి.. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆమె ‘విజయ’తో ముచ్చటించారు.  

నందికంది అని ఓ చిన్నగ్రామం మాది. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరం. నేను పుట్టి పెరిగిందా హైదరాబాద్‌లోనే. కేజీ నుంచి పీజీ వరకు హైదరాబాద్‌లోనే. కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్‌లో 1970 నుంచి 1975 వరకు చదివాను. పెళ్లి అయ్యాక ఒక పదేళ్లు నా ఫీల్డ్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉండటం.. వాళ్ల చదువులు.. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఏదేమైనా.. ఇల్లు.. పిల్లలు.. మనం ఇష్టంగా ఎంచుకున్న రంగం అన్నీ ముఖ్యమైన బాధ్యతలుగా భావిస్తాను. కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలంటే కాస్త సమయం ఎక్కువగా కేటాయించాల్సి వుంటుంది. ఆ సమయంలో మన ప్రొఫెషనల్ కెరీర్‌కు కొంత గ్యాప్ వస్తుంది. ఆ సమయలో దాన్ని భర్తీ చేయడం అనేది వాళ్ల వాళ్ల ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. 

ఆర్ట్స్ ఓ భిన్నమైన సబ్జెక్టు..

పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నేను చదివిన కాలేజీలో అయిన జేఎన్‌టీయూ కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్లు టీచింగ్ కోసం నన్ను పిలిచారు. అలా టీచింగ్ చేయడానికి నాకు అవకాశం లభించింది. 1989 నుంచి పర్మినెంట్ ఫ్యాకల్టీగా నేను అక్కడే పనిచేశాను. తర్వాత నేను 2011లో రిటైర్ అయ్యాను. జేఎన్‌టీయూలో లెక్చరర్‌గా స్టార్ట్ చేసి.. ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యాను. టీచింగ్ చేసే సమయంలో స్టూడెంట్స్‌తో పాటు నేను కూడా వర్క్ చేసేదాన్ని.. అలా చేయడం వల్ల వాళ్లు ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని నా అభిప్రాయం. అలా క్లాసులు చెప్పుకుంటూ.. వర్క్ షాప్స్ కూడా చేశాను. ఆర్టిస్టు మంచి టీచర్ కావాలంటే ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉండాలి. ఆర్ట్స్ అనేది చాలా భిన్నమైన సబ్జెక్టు. ఇప్పటి వరకు చాలా షోలు నిర్వహించాను.

ఇంట్లోనే స్టూడియో.. 

ఇంట్లోనే నా స్టూడియో ఉంది. ఇంటి పనులు అన్నీ పూర్తి అవ్వగానే కాలేజీకి వెళ్లినట్టు స్టూడియోకు వెళ్తాను. ఇంకా రెగ్యులర్‌గా నేషనల్, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌లలో పాల్గొంటాను. నా వయసు 72 ఏళ్లు. నాకెప్పుడూ అలా అనిపించదు. ఎందుకంటే నేను నా వర్క్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ఒక మహిళగా నేను ప్రపంచాన్ని ఎట్లా చూస్తున్నాను.. నా చుట్టూ వాతావరణం ఎలా ఉంది? ఒక తల్లిగా.. బిడ్డగా.. మనవరాలి గా.. నా ఏడు దశాబ్దాల కాలంలో చాలా పెళ్లిళ్లు.. పెరంటాలు.. పూజాలు.. పండగలు.. ఇంకా మంచి మంచి క్షణాలు.. నా డ్రీమ్స్‌ను నా ఇష్టమున్న లోకేషన్‌లో నన్ను నేను ఊహించుకొని పెయింటింగ్స్ చేస్తుంటా ను.

నా పెయింటింగ్స్‌ను ఎంఎఫ్ హుస్సేన్ మెచ్చుకున్నారు. ఆయన నా పెయింటింగ్స్‌ను మెచ్చుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ఆర్టిస్టు. పెయింటింగ్స్ వేసేటప్పుడు ఏం ప్లానింగ్ వేసుకోను. ఖాళీ కాన్వాస్ మీద కూర్చొని ఫస్టు అంతా కలర్ పెట్టేస్తాను. సింపుల్‌గా ఆ రోజు ఇష్టమున్న రంగులను వేస్తాను. ఒక మెడిటేషన్ స్టేట్ అనొచ్చు. నేను ఎప్పుడు ఒక్కటి నమ్ముతాను. వాటీస్ ఆర్ట్ అంటే.. ఆర్ట్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్. మన ఫీలింగ్స్ ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఆ క్షణానికి తగ్గట్టు మన ఫీలింగ్స్, పెయింటింగ్స్ మారుతూ ఉంటాయి. ప్రతి క్షణంలో మార్పు ఉంటుందని నేను నమ్ముతాను.  

బీ బోల్డ్.. 

ఫీల్డ్‌లోకి ఇప్పుడొస్తున్న ఆర్టిస్టులకు నేను చెప్పేది ఒక్కటే.. ఏది సులభంగా చేయగలుగుతున్నారో అదే వాళ్ల స్టుల్ అంటాను. దాన్ని చేయడానికి భయపడొద్దు. నిర్భయంగా దాన్ని కంటిన్యుగా చేయాలి. చేస్తూ ఉంటే.. చేస్తూ ఉంటే.. దాంట్లో నుంచే నీకు కొత్తదనం పుడుతుంది. వాళ్లు ఇట్ల చేసిండ్రు.. నేను ఇట్ల చేస్తాను.. ఇప్పుడది ట్రెండ్.. ఇది ట్రెండ్ అనేది ఆర్ట్‌లో పనికి రాదు. సొంతంగా గుండె లోతుల్లో నుంచి ఏమోస్తది.. అదే చేయమని చెప్తాను.

నేను క్లాసులో చెప్పేది కూడా ఇదే. బీ బోల్డ్. ఏ పని చేసినా బోల్డ్ చేయండి. తెల్ల కాన్వాస్‌ను చూసి భయపడకండి అని చెప్తాను. నేను టీచింగ్ చేసే సమయంలో అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఒక మార్పు తీసుకొచ్చాను. తరగతిలో ఏం చెప్పిండ్రో దాన్ని ఒక రికార్డు, బుక్ మెయిన్‌టెన్ చేయాలి. అలా చేస్తే ఒక సమయంలో అది ఒక గైడ్ బుక్ లాగ ఉండిపోతుంది.  

ప్రతి ఆరు నెలలకోసారి బయటి నుంచి ఒక ఆర్టిస్టును పిలిపించి.. ఒక వర్క్ షాప్ నిర్వహించేది. 

మేక్ రంగ్ అనే కాన్సెప్ట్..

ఈ విషయం తప్పకుండా చెప్పాలి.. ఒకసారి మా కుటుంబంతో కలిసి జూకు వెళ్లాను. ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంది. నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఏనుగులు బయటకు వచ్చి తిరుగుతు న్నాయి. ఒక విధంగా జంతువులన్నీ కూడా ప్రకృతిని పూర్తిగా ఆస్వాదిస్తున్నాయి. అప్పుడు నాకిపించింది.. మనుష్యులు ఎందుకు రియలైజ్ అవ్వడం లేదు. ప్రతి నిత్యం ఉండే రొటీన్ లైఫ్‌లో ఇవన్నీ మనిషి ఎందుకు గమనించలేకపోతున్నాడని. ఒక విధంగా మనిషి ప్రకృతి సౌందర్యం, సీజన్‌లో వచ్చే మార్పులను గమనించడం మానేశాడు. అలా ఆ ట్రిప్ నుంచి రాగానే..  డిపార్ట్‌మెంట్‌లో నేనే కదా హెడ్ అని.. విద్యార్థులకు “వీ విల్ సెలబ్రేట్ మాన్‌సూన్‌” అని ఒక కాన్సెప్ట్ ద్వారా “మేక్ రంగ్’ అని పెట్టాను.

అది ఒక వారం రోజుల పాటు జరిపించాను. అలా ఒక అరగంటలో నేను 150/150 పెయింటింగ్ వేశాను. పిల్లలందరు బ్యానర్లు చేశారు. క్లాసెస్ ఏం లేకుండా.. మీరెంత వర్క్ చేస్తే అన్ని మార్కులు ఉంటాయని.. చెప్పడంతో పిల్లలు ఎంతో ఆసక్తి అందమైన పెయింటింగ్స్ వేశారు. దానికి అనుకూలంగా ఒక వాతావరణాన్ని సృష్టించుకున్నాం. ఎట్లా అంటే మాన్‌సూన్ సీజన్ కాబట్టి.. అన్ని వర్షాల మీదా ఉంటే క్లాసికల్, మెలోడి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని వర్క్ షాప్‌ను నిర్వహించాం. అదొక అద్భుతమైన అనుభవం. నేను హెడ్‌గా ఉన్నప్పుడు 2008లో మా కాలేజీ యూనివర్సిటీ అయింది. 

అదొక మంచి జ్ఞాపకం

2002లో హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్ ఒకటి ఉండేది. వాళ్లు శిల్పకళ వేదికలో జరిగే  ప్రోగామ్‌కు అబ్దుల్ కలాం అతిధిగా పిలిచారు. ఆయనకు మొమెంటో ఏం ఇవ్వాలని ఆలోచిస్తున్న సమయంలో ఆయన 2020 డ్రీమ్ మీద ఒక పెయింటింగ్ వేసిద్దాం అనుకున్నాం. ఒక పదిమంది ఆర్టిస్టు లను ఎన్నుకున్నారు. నేను కూడా ఆ పదిలో ఉన్నాను. ఇక అందరం పని మొదలు పెట్టాం. వారందరి పెయింటింగ్స్‌లో నాది ఎంపికైంది.

ఆయనకు సన్మానం చేసి.. పెయింటింగ్స్ ఇచ్చేటప్పుడు ఒక్కటే మాట అన్నారు. అంజనీ ‘టచ్ ది మై హార్’్ట అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారంటే అందరిలా కాకుండా నేను ఆయన బుక్స్ కొన్నాను. ఆటోబయోగ్రఫీ చదివాను. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అనే పుస్తకం నుంచి కొన్ని విలువైన పాయింట్స్‌ను తీసుకున్నాను. పెయింటింగ్ పోస్టర్‌లా ఉండకూడదని నా అభిప్రాయం. అలా చాలా సహజ సిద్ధంగా వేసిన పెయింటింగ్ అది. ఆ పెయింటింగ్ ఇప్పటికీ రాష్ట్రపతి భవన్ ఉంది.

ఆర్టిస్టు నిత్య విద్యార్థి.. 

ఆర్ట్ అనేది ఒక జీవితం. ఆర్టిస్టుకు హృదయ స్పందన ఎక్కువుంటుంది. ఏదైనా చాలా మంచిగా అనిపించినదాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలని ఉంటుంది. దాంట్లో నా స్పెషల్ ఏంటంటే.. పెయింటింగ్స్‌లో ఎక్కువగా రంగులు వాడుతాను. ప్రతి ఆర్టిస్టు ప్రకృతితోనే ఇన్‌స్పైర్ అవుతారు. ముందు ప్రకృతిని ఆస్వాదిస్తేనే కదా దాని మాధుర్యం అర్థం అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చేయడాన్ని రెప్రజెంట్ ఆర్ట్ అంటారు.

దాంట్లో ఆర్టిస్టు ఉండరు. చిన్నపిల్లల వర్క్ చాలా ఎక్స్‌ప్రెస్సివ్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు ఫీల్ అయి చేస్తారు. దాన్ని లైవ్ ఆర్ట్ అంటారు. నాకిష్టమైన ఆర్టిస్టులు.. ఎమ్‌ఎస్ దేయిద్రే. ఆయన మంచి కలరిస్టు. ఆయన వేసిన కలర్స్ నాకు బాగా నచ్చుతాయి. తర్వాత విన్సెంట్ వాన్ గోఘ్.. పాల్ సీజాన్.. లక్ష్మా గౌడ.. వైకుంఠం.. సూర్య ప్రకాశ్.. వీళ్లందరు నాకు ఇన్‌స్పిరేషన్స్. ఏ దృక్పథమూ లేకపోతే అది ఆర్ట్ కాదు కదా. ఆర్టిస్టు అనే వారు నిరంతర విద్యార్థి అని చెప్పగలను.    

 రూప