హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని, రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాశ్ పాలేకర్ అన్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలో బుధవారం ఆయన తన బృందంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో రైతులను ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రాచీన సాగు విధానాలతో మంచి దిగుబడులు సాధించొచ్చన్నారు. అనంతరం మంత్రి తుమ్మల స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తుందన్నారు. ఆరోగ్యక తెలంగాణే తమ అభిమతమని స్పష్టం చేశారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు త్వరలో సుభాశ్ పాలేకర్ సహకారం తీసుకుంటామని తెలిపారు.