26-04-2025 12:50:20 AM
కాలి బూడిద అవుతున్న ప్రకృతి సంపద
శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్, ఏప్రిల్25 (విజయక్రాంతి): శాతవాహన యూనివర్శిటీలో రెండు రోజుల పాటు చెలరేగిన మంటలు విద్యార్థులను ఆందోళనకి గురి చేశాయి. యేటా వేసవిలో వర్సిటీలో మంటలు చెలరేగుతున్న నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు చెలరేగిన మంటల దాటికి వర్శిటీ పేపర్ గోదాములో పేపర్లు దగ్ధం అయ్యాయి. వర్శిటీ ఆవరణలోని చెట్లలో అగ్గి రాజుకోవడంతో ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పివేశారు. రెండో రోజున కూడా వివిధ రకాల చెట్లకు మంటలు అంటుకోవడంతో అవి కాలి బూడిదయిపోతున్నాయి.
పర్యావరాణానికి తీరని నష్టం
వర్శిటీలో తరుచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. 200 ఎకరాల విశాలమైన ఆవరణలో పెద్ద ఎత్తున పచ్చదనం పరుచుకుని ఉంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడల్లా పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీంతో చెట్లు, కొత్తగా చిగురించే మొక్కలు, చెట్ల నుంచి రాలి పడ్డ విత్తనాలు అన్ని కూడా మంటల్లో కాలి బూడిద అవుతున్నాయి. వర్శిటీ భవనాల వరకూ మంటలు విస్తరిస్తుండటం వల్ల వాటి అస్థిత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. వర్శిటీలో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నివారణ కోసం శాశ్వత చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. వర్శిటీ పరిసర ప్రాంతాల్లో కూడా రక్షణ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్ప్రింక్లర్ల ద్వారా పిచికారీ చేయించే విధంగా చొరవ తీసుకుంటే అగ్ని ప్రమాదాలకు తావుండదని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
రికార్డులు భద్రం: వీసీ ఉమేష్ కుమార్
పేపర్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల రికార్డులకు నష్టం ఏమీ జరగలేదని శాతవాహన యూనివర్శిటీ వీసీ ఉమేష్ కుమార్ తెలిపారు. ఎగ్జామ్ పేపర్స్, ఆన్సర్ షీట్స్ దగ్దం అయినప్పటికీ వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటరైజ్ చేశామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.