ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన వాటితో చర్మాన్ని నిత్యయవ్వనంగా మార్చుకోవచ్చు. మన అమ్మలు.. అమ్మమ్మల కాలంలో షాంపూకు బదులుగా కుంకుడుకాయలు, సబ్బులకు బదులుగా శనగపిండి, పసుపుతో నలుగు వాడేవారు.. ఆ కాలంలో ఎలాంటి రసాయనాలు లేనివి ఉపయోగించడం వల్ల ఇప్పటికీ వాళ్లు అందం చెక్కు చెదరలేదు. అయితే వంటింట్లో ఉండే సహజమైన వాటితో చర్మకాంతిని రెట్టింపు చేసుకోవచ్చు. దానికోసం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..
మన వంటింట్లోని వివిధ రకాల పదార్థాలతో అందాన్ని పెంచుకోవచ్చు. వాటిల్లో ఒకటి బియ్యం పిండి, చందనం, పసుపు, చక్కెర, లావెండర్ నూనెలతో సహజసిద్ధమైన బ్యూటీ మాస్క్‌లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
చందనంతో..
* ముఖంపై సహజమైన కాంతిని తీసుకురావాలనుకుంటే.. పెరుగు, పచ్చిపాలు, గంధపు పొడిని కలిపి పేస్ట్‌ల తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను సున్నితంగా ముఖానికి పట్టించి పది నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
* గుడ్డులోని తెల్లసొన, పెరుగు, కొద్దిగా యాపిల్ జూస్, గంధపు పొడి తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి కాసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే వృద్ధాప్య ముడతలు తొలగిపోతాయి.
బియ్యం పిండితో..
* ఒక చెంచా బియ్యం పిండి, రెండు కోడిగుడ్ల తెల్లసొన వేసి మిశ్రమాన్ని కలపాలి. ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.
* చెంచా టమాటా రసం, చెంచా గోధుమ పిండిలో.. ఒక చెంచా బియ్యం పిండి కలపాలి. ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ పట్టిస్తే ముఖంలో మచ్చలు తొలగిపోతాయి.
* రెండు చెంచాల బియ్యం పిండి, రెండు చెంచాల కలబంద జెల్ తీసుకొని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే ముఖం మీద ఉండే మృతకణాలు తొలగిపోతాయి.
పసుపుతో..
* ఒక చెంచా పసుపు తీసుకొని ఐరన్ పాన్ మీద వేయించాలి. పసుపు బంగారు రంగులోకి మారిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కాస్త తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లు చేసుకుని పావుగంట సేపు వదిలేయాలి. తరువాత ముఖాన్ని నీళ్లతో శుభ్రపరుచు కోవాలి. ఈ ప్యాక్ తరచూ వేసుకుంటుంటే మచ్చలు తగ్గుతాయి. చర్మం జిడ్డుగా ఉంటే తేనెకు బదులుగా పెరుగు, టమాటా రసం మిక్స్ చేసి ముఖానికి అప్లు చేయాలి. వీలైనంత వరకూ కల్తీ పసుపు కాకుండా స్వచ్ఛమైన పసుపు వాడితే ఫలితం ఉంటుంది.
చక్కెరతో..
* గులాబీ రేకల్ని ముద్దగా చేసి, దానికి చెంచా చొప్పున తేనె, చక్కెర కలిపి ముఖానికి పూత వేయండి. అలా ఓ నలభై నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* సగం కప్పు కొబ్బరి తురుములో చెంచా బాదం నూనె, రెండు చెంచాల చక్కెర కలిపి ఒంటికి రాసి మృదువుగా స్క్రబ్ చేయాలి. చక్కెరలోని గ్లుకాలిక్, ఆల్ఫాహైడ్రాక్సిల్ యాసిడ్లు చర్మ సమతుల్యతను కాపాడి మృదుత్వాన్ని అందిస్తాయి.
* ముఖం నిర్జీవంగా మారినప్పుడు చెంచా ఆలివ్ నూనెకు రెండు చెంచాల చక్కెర కలిపి ముఖానికి రాయాలి. ఆపై చేతుల్ని నీళ్లతో తడుపుతూ నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా కనీసం నలభై నిమిషాలు చేయగలిగితే చర్మం నిగనిగలాడుతుంది.
లావెండర్ నూనెతో..
* రెండు చుక్కల లావెండర్ నూనెని సగం కప్పు బ్రౌన్ షుగర్ కలిపి స్నానం చేసేముందు ఒంటికి రాసుకుని రుద్దుకోవాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి మొటిమలూ, యాక్నే సమస్యలను తగ్గిస్తుంది.
* రెండు చెంచాల అరటిపండు గుజ్జుకి చెంచా తేనె, రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ఒక అర్ధగంట తర్వాత రబ్ చేస్తే చాలు చర్మం మెరిసిపోతుంది.
* చెంచా బాదం పేస్ట్‌కి రెండు చుక్కల లావెండర్ ఆయిల్ కలపాలి. దీన్ని ఒంటికి రాసి మృదువుగా రుద్దాలి. ఇది మచ్చలూ, మృత కణాలను తగ్గిస్తుంది.
నా బ్యూటీ సీక్రెట్ ఇదే..
నేను ఎప్పుడూ సంప్రదాయ సౌందర్య సాధనల కాన్సెప్ట్‌ను నమ్ముతా. బ్యూటీ ప్రోడక్ట్స్ కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు.. ఆరోగ్యపరమైనవిగానూ ఉండాలి. నేను ఉమ్మ డి కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల పెద్దల నుంచి చర్మ సంరక్షణ గురించి ఎన్నో విషయా లు తెలుసుకున్నా. స్కిన్ కేర్ కోసం నర్గీస్, కుంకుమడి నూనె, నాగమోత, బహుమంజరి నూనె, చందనం, బాదం నూనె, పూలు, మూలికలు లాంటివి మాత్రమే వాడుతా.
పురాతన సౌందర్య సాధనాలతో సహజంగా అందం సొంతం చేసుకోవచ్చు. నేను ఇప్పటికీ ఇవే వాడుతాను. మా పెద్దవాళ్ల చెప్పిన ఫ్యామిలీ బ్యూటీ సీక్రెట్స్ ఏంటని? అడుగుతుంటారు చాలామంది. మా అమ్మమ్మది అందమైన చర్మం. ప్రకృతిసిద్ధమైన వనమూలికలు వాడటమే ఆమె ఆరోగ్యం రహస్యం. స్కిన్ గ్లో కోసం అమ్మమ్మ చందనం, బాదం నూనె కలయికను వాడుతుంది. ఈ మూలికల మిశ్రమం చర్మ సమస్యలను నయం చేయడమే కాకుండా అందంగా ఉండేలా చేస్తుంది.
నేను ఎల్లప్పుడూ తాజా పువ్వులు, కుంకుమడి నూనె , తులసి వంటి సహజ చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడుతా. అలాగే సరైన క్రమశిక్షణ, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా అందంగా ఉండేలా చేస్తాయి. క్రమతప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం ఆరోగ్యంగానే కాదు.. అందంగా ఉంచేలా చేస్తుంది. చాలామంది కాస్మొటిక్ పొడ్రక్ట్స్‌ను తాత్కాలిక అందం కోసం తహతహలాడుతున్నారు. కానీ నేటికి కొన్నిచోట్లా సహజ సౌందర్య సాధనాలు దొరుకుతున్నాయి. వాటికి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది.