15-04-2025 12:57:43 AM
హిస్సార్, ఏప్రిల్ 14: కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు వైరస్ పట్టుకుందని ప్రధా ని నరేంద్రమోదీ ఆరోపించారు. అందువల్లే తమ ప్రభుత్వం కొత్తగా ఆమోదం తెలిపిన వక్ఫ్ చట్టాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం రూపొందించిన రాజ్యాంగాన్ని తన సొంత ప్రయోజనాల కోసం ఆయుధంగా మార్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌కు ద్రోహం చేసిందని దుయ్యబట్టారు.
సోమవారం హర్యానాలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అటు కాంగ్రెస్ అధిష్ఠానంపై, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం విషయంలో ఇటు తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మండిపడ్డారు. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయ డం ద్వారా తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే.. బుల్డోజర్లతో అడవులను ధ్వంసం చేయడం, వన్యప్రాణులను చంపే పనుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిజీబిజీగా ఉందని ఆరోపించారు.
ప్రకృతిని నాశనం చేసి వన్యప్రాణు లకు హాని తలపెట్టడమే కాంగ్రెస్ పాలన అని దుయ్యబట్టారు. ఇచ్చిన ఎన్నికల హామీలను తెలంగాణ ప్రభుత్వం మర్చి పోయిందని యమునానగర్ ర్యాలీలో ప్రధాని విమర్శించారు. హిస్సార్‌లో విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసం గిస్తూ ‘పవిత్రమైన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అధికారం కోసం ఆయుధంగా మార్చుకుం ది.
అధికారానికి ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడల్లా ఆ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. బాబాసాహెబ్ సమానత్వాన్ని తీసుకురావాలని కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు వైరస్‌ను వ్యాప్తి చేసింది. వక్ఫ్ పేరుతో లక్షలాది హెక్టార్ల భూమి ఉంది.
వక్ఫ్ ఆస్తులతో పేదలకు లబ్ధి చేకూరలేదు. ఆ ఆస్తుల నుంచి భూ మాఫియా ప్రయోజనం పొందింది. ముస్లిం లు సహా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన తరగతల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఉపయోగించలేదు’ అని పేర్కొన్నారు.
శంకరన్ నాయర్‌పై శీతకన్ను..
అంబేద్కర్ సహా దేశం కోసం పోరాడిన ఎందరినో కాంగ్రెస్ పట్టించుకోలేదని ప్రధా ని నరేంద్రమోదీ విమర్శించారు. కేరళకు చెందిన న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు చెట్టూర్ శంకర్ నాయర్‌ను ఉద్దేశిస్తూ హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లోని ప్రతిబిడ్డా ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ శంకర్ నాయర్, డాక్టర్ అంబేద్కర్ సహా ఇతర స్వాతంత్య్ర సమరయోధులను తన చరిత్ర నుంచి పక్కన పెట్టింది. దానికి కారణం వారు తమ కథనానికి సరిపోకపోవడమే. తొలి నుంచి ఆ పార్టీ వారసత్వ రాజకీ యాల్లో బిజీగా ఉంది’ అని ప్రధాని విమర్శించారు. కాగా కేరళకు చెందిన నాయర్.. 1919 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తరవాత వైశ్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు రాజీనామా చేశారు.
ప్రభుత్వాన్ని బద్నాం చెయొద్దు
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దని బీజేపీ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికారు. హర్యానాలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రధాని ఎలా మాట్లాడతారని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూములు అటవీ ప్రాంతం కాద ని, వాస్తవాలను కోర్టు ముందు పెడతామని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ప్రధానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.