calender_icon.png 29 November, 2024 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుకోడి కూర.. 2 వేలు మామూలు?

29-11-2024 12:25:43 AM

  1. సారు పర్యటనకు వచ్చారంటే ఆయన డిమాండ్లే వేరు !
  2. తలలు పట్టుకుంటున్న కిందిస్థాయి అధికారులు, సిబ్బంది

చెన్నూర్, నవంబర్ 28: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల పరిషత్ కార్యాలయ ఇంచార్జి ఎంపీడీవో సత్యనారాయణ గ్రామ పర్యటనకు వస్తే ఆయనకు నాటు కోడికూర వండిపెట్టాల్సిందేనని, పర్యటన ముగించుకుని వెళ్తున్నప్పుడు చేతిలో కనీసం రూ.2 వేలు చేతిలో పెట్టి సాగనంపాల్సిందే.

అంతేకాదు.. ఆయన అడ్డగోలు నిబంధనలు, అర్థం కాని పనులతో ఇబ్బందులు పడుతున్నామంటూ యంత్రాంగం గగ్గోలు పెడుతున్నది. కోటపల్లి మారుమూల మండలం కావడంతో ఇక్కడ ఉన్నతాధికారులు రారనే ధైర్యంతో ఆ అధికారి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

సదరు సార్.. గతంలో ఎంపీవోగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే నాటి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులు గురి చేయగా, నాటి ప్రభుత్వం ఆయన్ను తాండూరు మండలానికి డిప్యూటేషన్ పంపించింది. ప్రస్తుత ఎంపీడీవో అనారోగ్యంతో ఐదు నెలల కిందట దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా, సదరు అధికారి రంగంలోకి దిగాడు.

పల్లెలకు నిధులు లేక వెలవెలబోతుండడంతో  పంచాయతీ కార్యదర్శులే తమ జీతాలు వెచ్చించి ఖర్చు పెడుతున్నారు. వారు చేసిన ఖర్చులకు కూడా చెక్కులు జారీ చేసేందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. సార్‌కి పర్సంటేజీ రూపంలో చెల్లిస్తే తప్ప చెక్ పాస్ చేయరని తెలిసింది.

సార్ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న జీపీల్లోనైతే మరీ దారుణం.. పర్సంటేజీలు రెట్టింపు. ఇవ్వకుంటే ఇక అవి పెండింగే.  సారు కుమార్తె పెండ్లి సమయంలో ఆఫీసు రాలేదని, ఆయినప్పటికీ, ఆయన హాజరు వేసుకొని జీతం తీసుకున్నారని తెలిసింది.

చెప్పిందే వింటే నో వర్క్..

సారుకు దగ్గరగా ఉన్న వారికి ఏ పనిచెప్పడని, మిగతా వారిపై పని ఒత్తిడి పెంచుతా డని సమాచారం. సర్వే డాటా ఆన్‌లైన్ ఎం ట్రీ విధుల్లోనూ తనకు దగ్గరగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇచ్చిన ఈ సారు కొంతమందికి మాత్రమే కావాలని ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోతున్నారు.

ప్రస్తుతం కుల గణన సర్వే జరుగుతున్న నేపథ్యంలో ఆయన కోటపల్లి చుట్టు పక్కల గ్రామాలకే పరిమితమయ్యారని, ఆపై ఉన్న గ్రామాలను కనెత్తి కూడా చూడలేదనే ఆరోపణలు ఉన్నాయి.

మా దృష్టికి రాలేదు 

కోటపల్లి ఇంచార్జి ఎంపీడీవో పంచాయతీ సెక్రటరీలు, సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. ఈ విషయంపై శాఖాపరంగా విచారణ జరుపుతాం. నిజమని తేలితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్య లు తీసుకుంటాం. ఎవరైనా ఇలాం టి ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలి. వారికి సరైన న్యాయం చేస్తాం.

 వెంకటేశ్వర్లు, 

జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల