calender_icon.png 25 October, 2024 | 12:59 AM

నాటు తుపాకులు తయారీదారుడి అరెస్ట్

29-08-2024 03:28:08 AM

  1. పోలీసుల అదుపులో తుపాకులు కొన్న మరో ముగ్గురు 
  2. వివరాలు వెల్లడించిన సిరిసిల్ల ఎస్పీ అఖిల్

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 28 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లాలో నాటు తుపాకులు చేస్తున్న ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం..  గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి నాటు తుపాకులు తయారు చేస్తున్నాడు. వాటిని ఇదే గ్రామంలో వన్యప్రాణులకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసు లు గజసింగవరం గ్రామంలోని రాయలింగు శంకర్ ఇంట్లో సోదాలు చేశారు. స్థానికంగా దొరికే పనిముట్లను ఉపయోగించి నిందితుడు నాటు తుపాకులు తయారు చేస్తున్నాడని గుర్తించారు.

నిందితుడి ఇంట్లో రెండు తుపాకీ బ్యారెళ్లతో పాటు తుపాకులు తయారు చేసేందుకు వాడే రంపం, సుత్తి, కత్తి, ఆకు రాయి, డ్రిల్లింగ్ మిషన్, దూగడ మెషిన్, ఎయిర్ బుల్లోజర్ సాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అలాగే తుపాకులు కొనుగోలు చేసిన వన్యప్రాణుల వేటగాళ్లు చంద్రమౌళి, శాతవేణి హరీష్, లోగిడి గంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు తుపాకులతో పాటు నాలుగు ట్రిగ్గర్ విడి భాగాలు సాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.