calender_icon.png 20 September, 2024 | 10:04 PM

చైనాకు నాటో హెచ్చరిక

13-07-2024 12:00:00 AM

యుద్ధం పేరిట ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న విధ్వంసానికి చైనా అండదండలు అందిస్తున్నదంటూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సభ్య దేశాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. డ్రాగన్ దేశం ‘నిర్మాణాత్మక విధ్వంసకారి’ గా మారిందని కూడా ఆ దేశాలు దుమ్మెత్తి పోశాయి. అమెరికాలోని వాషిం గ్టన్‌లో జరిగిన నాటో సమావేశంలో ఈ మేరకు సభ్య దేశాలు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నాటోలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలాంటి అగ్రరాజ్యాలతో పాటు పలు యూరప్ దేశాలు సభ్యలుగా ఉన్నాయి. రష్యాతో భాగస్వామ్యానికి ఎలాంటి పరిమితులు లేవంటూ ఇటీవల పుతిన్‌తో సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు లీ జిన్‌పింగ్ చేసిన ప్రకటనను ఆ దేశాలు ప్రస్తావిస్తూ రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చైనా పూర్తిగా మద్దతునిస్తోందని ఆరోపించాయి.

దీనివల్ల రష్యా పొరుగుదేశాలతో పాటు యూరోఅట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా దుందుడుకు విధా నాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రతకు, విలువలకు సవాలుగా ఉం టున్నాయని మండిపడ్డాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా బాధ్యతాయుతంగా మసలుకోవాలని సభ్య దేశాల ప్రతినిధులు హితవు పలికాయి. ఉక్రెయిన్‌లో అమాయకుల ప్రాణాలను బలిగొం టున్న రష్యాకు సహ కరించడం తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి చార్టర్‌కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనాపై ఉం దని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించవద్దని స్పష్టం చేశారు. అలా చేస్తే అది చైనాకే నష్టమని హెచ్చరించారు.

అయితే నాటో దేశాలు చేసిన హెచ్చరికను చైనా కొట్టిపారేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆసియాలో అలజడికి కారణం కావద్దంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆ కూటమి దేశాలకు హితవు పలికారు. ‘న్యూయార్క్ డిక్లరేషన్’లో చేసిన ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలు, దురుద్దేశ పూరితమైనవని కూడా ఆయన తీవ్రపదజాలంతో దుయ్య బట్టారు. నాటో కూటమి ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి అమెరికాతో పాటుగా 31 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. జపాన్ సహా కొన్ని దేశాలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యా యి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడాఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఈ సందర్భంగా జెఎలెన్‌స్కీ నాటో సభ్య దేశాలను కోరారు. ఉక్రెయిన్‌కు పూర్తి అండగా ఉంటామని నాటో ప్రతినిధులు మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా కూటమిలో ఉక్రెయిన్‌ను సభ్య దేశంలా చేర్చుకునే ప్రక్రియను కొనసాగించాలని కూడా నిర్ణయించాయి. కాగా కూటమిలో 32వ సభ్య దేశంగా స్వీడన్‌కు ఈ సమావేశం ఆహ్వానం పలికింది. 

అమెరికాలో మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తాను తిరిగి గెలిస్తే బాధ్యతలు స్వీకరించడానికి ముందే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందాన్ని సాధిస్తానని మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో నాటో సభ్య దేశాలన్నీ ముక్తకంఠంతో ఉక్రెయిన్‌కు మద్దతు పలకాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్త్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సభ్యత్వానికి ఎలాంటి కాలపరిమితిని ప్రకటించని ఈ సమావేశం ఆ దేశానికి దీర్ఘకాలిక సహాయాన్ని అందించడానికి హామీ ఇచ్చింది. చైనాను నాటో ఇంత బహిరంగంగా హెచ్చరించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. నాటో సమావేశానికి రెండు రోజుల ముం దు భారత ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడంపై అమెరికా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికాతో భారత్ సంబంధాలకు ఇది అడ్డుకాబోదని విశ్లేషకులు చెబుతున్నప్పటికీ పరోక్షంగా భారత్‌కు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుంది.