calender_icon.png 29 October, 2024 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2025లో దేశ వ్యాప్తంగా జన గణన

29-10-2024 01:47:45 AM

2026 వరకూ సాగనున్న ప్రక్రియ

2028లో డీలిమిటేషన్ పూర్తయ్యే అవకాశం

కుల గణన కోసం ప్రతిపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: దేశ వ్యాప్తంగా జన గణన ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ తర్వాత డీమిలిటేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2025లో దేశ వ్యాప్తంగా జనగణన చేపట్టేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ పక్రియ 2026లో పూర్తయ్యే అవకాశ ముంది. తర్వాత మరో రెండేళ్లలో అంటే 2028 నాటికి డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయనుంది. అయితే జనాభా లెక్కల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. 

నాలుగేళ్ల ఆలస్యానికి కారణం

భారత ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి దేశ వ్యాప్తంగా ఉన్న జనాభా సంఖ్యతో పాటు వారి ఆర్థిక సమాజిక పరిస్థితుల వివరాలను కూడా సేకరిస్తుంది. అనంతరం వాటిని నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌లో నమోదు చేస్తుంది. ఇలా సేకరించిన వివరాల ఆధారంగానే ప్రజల సంక్షేమం తోపాటు దేశ అభివృద్ధికి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మన దేశంలో చిట్టచివరి సారిగా 2011లో జన గణన జరిగింది. ఈ నేపథ్యంలో 2021లో జన గణన జరగాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా పలు కారణాలతో ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే 2025లో జనాభా లెక్కలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం 2028 నాటికి డీలిమిటేషన్ ప్రక్రియను ముగించాలని భావిస్తోంది. 

డీలిమిటేషన్ ప్రక్రియలో ఏం చేస్తారు

డీలిమిటేషన్ గురించి సులువుగా చెప్పాలంటే నియోజకవర్గాల పరిధిని నిర్ధారించడం. జనాభా ఆధారంగా ప్రభుత్వం నియోజకర్గాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. జనాభా పెరిగితే నియోజకవర్గాల పరిధి తగ్గి, వాటి సంఖ్య పెరుగుతుంది. మొట్టమొదటగా 1951 జనాభా లెక్కల ఆధారంగా 1952లో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల సంఖ్యను నిర్ధారించింది. ఆ తర్వాత 1963, 1973లలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. ఆ  తర్వాత పలు కారణాలతో ఈ డీలిమిటేషన్ ప్రకియ వాయిదా పడుతూ వస్తోంది. 

కుల గణన కోసం ప్రతిపక్షాల డిమాండ్ 

దేశంలోని జనాభా లెక్కలను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశ వ్యాప్తంగా కుల గణన కూడా చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కుల గణన చేపట్టేందుకు చొరవ చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. కుల గణన చేయడానికి మోదీ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడాన్ని మరో సీనియర్ నేత మాణికం ఠాగూర్ తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం ఓబీసీ వర్గాలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు డీలిమిటేన్ ప్రకియ కారణంగా ఉత్తరాదిలో లోక్‌సభ స్థానాల సంఖ్య విపరీతంగా పెరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ లో తమ ప్రాతినిధ్యం తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.