14-03-2025 12:00:00 AM
ముషీరాబాద్, మార్చి 13: ఓబీసీ డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా ఉద్యమించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అందుకు ప్రతీ ఓబీసీ సోదరుడు ఉద్యమించాలన్నారు. గురువారం ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గువ్వల భరత్ కుమార్ అధ్యక్షత ఓబీసీ డిమాండ్లపై బీసీ మేధావుల సదస్సు జరిగింది.
ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేడు ఓబీసీల మీద దృష్టి సారించిందని, ప్రధాని మోదీ ఓబీసీ పక్షపాతి అని, మోదీతోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ ఉద్యమం పతాకస్థాయికి చేరిందని, ఈ దశలో ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో బీసీబిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.
కేంద్ర విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా దామాషా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతం వరకు పెంచాలని, పంచాయతీ సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. టీడీపీ ఎంపీ మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీ ఉద్యమం కీలకదశకు చేరుకున్నదని, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లా డి పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు మద్దతు కూడగడుతామన్నారు.
కర్నూలు ఎంపీ నాగరా జు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమంలో నీయకులు పితాని ప్రసాద్, రాజ్‌కుమార్, శ్రీనివాస్‌రావు, బోగి రమణ, శశిభార్గవి, బొమ్మని కోటేశ్వర్‌రావు, రాజశేఖర్, సుభాష్ యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.