16-04-2025 12:30:42 AM
ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ పిలుపు
ముషీరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): కార్మిక వర్గం పోరాడి సాధించుకు న్న చట్టాలను మార్చి యజమాన్యాలకు అనుకూలంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ మే 20వ తేదీన జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతటానికై హైదరాబాద్ నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ పిలుపునిచ్చారు.
ఈ మేరకు సోమవారం హిమాయ త్ నగర్ లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రజలను మరొక మారు బానిసత్వంలోకి తీసుకు వెళ్లే పద్ధతుల్లో రాజ్యాంగాన్ని మార్చి మణు ధర్మశాస్త్రాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నద న్నారు. కార్మికుల్ని ప్రజల్ని చైతన్య పరిచేందుకు ఈనెల19 వ తేదీన కోటి ప్రాంతంలో మే 6 వ తేదీన సికింద్రాబాద్ ప్రాంతంలో మే10వ తేదీన అమీర్పేట్ ప్రాంతంలో విస్తృతంగా కరపత్రాలు పంచి చైతన్య పరచాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మే13 వ తేదీన సెంట్రల్ లేబర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని, మే 18 వ తేదీన హైదరాబాద్ నగరవ్యాప్తంగా బైక్ ర్యాలీలను నిర్వహించి మే 20వ తేదీన ఇందిరా పార్క్ లో భారీ బహిరంగ సభను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి అధ్యక్షత వహించగా సిఐటియు నగర అధ్యక్షులు జె కుమారస్వామి, టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌ఎల్ పద్మ, ఐ ఎఫ్ టి యు నగర నాయకులు అరుణ, శివ బాబు, ఏ ఐ యు టి యు సి నాయకులు భరత్, టిఎన్టియుసి నాయకులు రత్నం, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పి వెంకటయ్య, ఉప ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కిషన్, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.