వికారాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ పర్యటించారు. లగచర్ల వాసులతో మాట్లాడిన ఎస్టీ కమిషన్ సభ్యుడి ముందు మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. లగచర్ల ఫార్మాసీటీ భూసేకరణకు వచ్చింది కలెక్టర్ ప్రతీక్ జైన్ అని తమకు తెలియదని గ్రామస్తులు తెలిపారు. గొడవ జరిగిన రోజు తమ భూములు పోతాయేమో అని కోపంతో పొరపాటు జరిగిందన్న లగచర్ల గ్రామస్తులు కలెక్టర్ భద్రతా సిబ్బంది లేకుండా రావడంతో ఎవరో అనుకున్నామని చెప్పారు. అర్థరాత్రి పోలీసులు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారని వాపోయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఘటనపై అర్థరాత్రి ఇండ్లలోనికి రావాల్సిన అవసరం ఏంటాని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలి కానీ, ప్రజలను ఎందుకు భయపెడుతున్నారని ఎస్టీ కమిషన్ సభ్యుడు పోలీసులను అడిగారు.
దీంతో చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. భద్రతా చర్యలు చేపట్టకపోవడం సరికాదని, నీతినిజాయితీ ఉంటే గ్రామంలోనే అడగాల్సిందని ఎస్టీ కమిషన్ సభ్యుడు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించే విధానం ఇది కాదని, ప్రజలను మరోసారి ఇబ్బందులకు గురి చేయెద్దని హుస్సేన్ నాయక్ హెచ్చరించారు. ఈ సందర్బంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ... కొడంగల్ లో ప్రజాలకు ఉపాధి కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వం ఆలోచనను స్వాగతిస్తున్నామని, ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. లగచర్లలో ఫార్మాసీటి కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ విధానం సరిగా లేదని ఆయన మండిపడ్డారు. లగచర్ల ఘటనను సుమోటోగా తీసుకున్నామని ఎస్టీ కమిషన్ సభ్యుడు పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లుగా లగచర్లలో పరిస్థితి లేదని, అక్కడి ప్రజలు చెప్తున్నట్లే ఉందన్నారు. రోజురోజు లగచర్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని హుస్సేన్ నాయక్ వెల్లడించారు.