calender_icon.png 16 October, 2024 | 2:26 PM

దేశ భద్రతకే ప్రాధాన్యం

16-10-2024 03:13:59 AM

  1. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 
  2. దామగుండంలో నేవీ రాడార్ కేంద్రానికి  శంకుస్థాపన 

నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై తప్పడు ప్రచారాన్ని నమ్మొద్దు 

గత ప్రభుత్వం హయాంలోనే నేవీకి భూ బదలాయింపు: సీఎం రేవంత్ రెడ్డి 

* నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై అపోహలను నమ్మవద్దు. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతున్నది. ఆ గుర్తింపు మరింత పెరుగనున్నది.

 సీఎం రేవంత్‌రెడ్డి

* దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సమంజసం కాదు. గత ముప్పు ఏళ్ల నుంచి మనదేశం కమ్యూనికేషన్  వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నది. 

 కేంద్రరక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

వికారాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : దేశ భద్రత, రక్షణ విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని, దేశం బలమైన మిలిటరీని నిర్మించడానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖలతో  కలిసి నేవీ రాడార్ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై కొంతమంది ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. పర్యావరణానికి నష్టం జరుగుతుందని ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు.  నేవీ రాడార్ ప్రాజెక్టుతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండబోదని ఆయన తెలిపారు.

దేశ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, రాజకీయాలు వేరు.. దేశ భద్రత వేరని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సమం జసం కాదన్నారు. దేశరక్షణ, భద్రత విషయంలో కేంద్రం మరింత కట్టుబడి పనిచేస్తుందన్నారు. గత ముప్పు ఏళ్ల నుంచి మనదేశం కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ వస్తుంద న్నారు.

అందులో భాగంగానే దామగుండంలో నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  దేశ భద్రతకు, రక్షణకు ఈ రకమైన కేంద్రాలు అత్యంత ఉపయోగకరమన్నారు. ఇండో ఫసిపిక్ రీజి యన్‌లో సవాళ్లు పెరిగాయని, సముద్ర ఖనిజ సంపదపై  అన్నీ దేశాలు దృష్టి పెట్టాయని.. సముద్రాలపై ఆదిపత్యం ప్రదర్శిస్తేనే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతామని రక్షణ మంత్రి తెలిపారు.

నేడు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాడార్ కేంద్రాన్ని ప్రారంభిం చడం హర్షణీయమన్నారు. కమ్యూనికేషన్‌లో వచ్చిన మార్పుల వల్లనే కొవిడ్ సమయంలో సవాళ్లను ఎదుర్కోగలిగామని తెలిపారు. మలక్కా నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వరకు మన నౌకాదళం ఎంతో బలంగా విస్తరించి ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రాడార్ మన నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

ఈ పదేళ్లలో దేశభద్రత ఎంతో మెరుగైందని, దేశ రక్షణలో నేవీది కీలక పాత్ర అని చెప్పారు. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చాలా కాలంగా పెడింగ్‌లో ఉందన్నారు. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం ఎంతో ఉందని, సభా వేదికగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కష్టజీవులని, రాడార్ ఏర్పాటుతో వారి సేవలు దేశానికి మరింత అందుతాయని కొనియాడారు. దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానిది కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. 

గత ప్రభుత్వం హయాంలోనే భూ బదలాయింపు

నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలోనే 2017లో దామగుం డం భూమి బదలాయింపు జరిగిందని సీఎం తెలిపారు. నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలు గతంలోనే జరిగినట్లు చెప్పారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అడగగానే మేం కొనసాగించినట్లు తెలిపారు.

దేశ రక్షణ విషయంలో రాజీపడొద్దనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలమనే విషయాన్ని పర్యావరణ ప్రేమి కులు గుర్తుపెట్టుకోవాలని సీఎం సూచించా రు. దేశ రక్షణకు సంబంధించిన ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సమంజసం కాదన్నారు.

నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు లక్షల చెట్లు కొట్టేస్తారనే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సీఎం సూచించారు. రాజనీతితో ఆలోచించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీ లు, రాజకీయాలు చేయాలని, మిగతా సమయంలో దేశ రక్షణ విషయంలో కలిసికట్టు గా ముందుకు పోవాలన్నారు.

వీఎల్‌ఎఫ్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని సీఎం తెలిపారు. దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అనుమతించాలని, పురాతన ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కేంద్ర రక్షణ మంత్రిని సీఎం సభా ముఖంగా కోరారు.

ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని సీఎం కోరారు. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యమ్రంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. 

అపోహలను నమ్మొద్దు: సీఎం రేవంత్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేవీ  రాడార్ కేంద్రం ఏర్పాటుపై కొందరు పనిగట్టుకొని అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతున్నదన్నారు. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్‌ఎఫ్‌సీ లాంటి కేంద్రాలతో హైదరాబాద్ గుర్తింపు పొందినట్లు చెప్పారు.

వీఎల్‌ఎఫ్ ఏర్పాటుతో ఆ గుర్తింపు మరింత పెరుగనున్నట్లు తెలిపారు. ఈ గుర్తింపు జీర్ణించుకోలేని కొందరు ఈ ప్రాజెక్టును వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో ప్రజలకు అన్యాయం జరుగుతుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో 1990లోనే ఇలాంటి ప్రాజెక్టు ప్రారంభించారని, అక్కడి ప్రజలకు, ప్రకృతికి  ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదనే సీఎం చెప్పారు.

దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్ ప్రాజెక్టు మన ప్రాంతానికి రావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ ప్రజలు, ముఖ్యం గా వికారాబాద్ జిల్లా ప్రజలు గుర్తించాలని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టుపై వివాదాలకు తెరలేపుతున్న వారు దేశరక్షణ గురించి ఆలోచన చేయాలని హితవు పలికారు. దేశ రక్షణకోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసేవారికి ఇకనైనా కనువిప్పు కలగాలని సీఎం తెలిపారు.