calender_icon.png 5 February, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో జాతీయ పార్టీల ఎదురీత!

02-02-2025 12:00:00 AM

దేశ రాజధాని ఢిల్లీలో రసవత్తర ఎన్నికల పోరు సాగుతోంది. ఈ నెల 5న పోలింగ్ జరగనున్న ఢిల్లీలో నాలుగోసారి అధికార సాధనకు అమ్ ఆద్మీ పార్టీ, ఈ దఫానైనా అధికారంలోకి రావాలని బీజేపీ, దేశంలో ఎదురుగాలితో సతమతవుతున్న కాంగ్రెస్ ఉనికికోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఢిల్లీ శాసనసభలో 70 స్థానాలకు  ఒకే విడతలో పోలింగ్ జరిపేందుకు ఎలక్షన్ కమి షన్ సమయమత్తం అయ్యింది.

మునుపెన్నడూ జరగని రీతిలో ముక్కోణపు పోరు జరుగుతోంది. ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లలో 83.49 లక్షల పురుష ఓటర్లు ఉండ గా, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని ఇప్పటికే అధికారికంగా ఎన్నికల సం ఘం ప్రకటించింది. ఎన్నికలు దగ్గరపడడంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేసాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దిగ్గజాలు ప్రధాని నరేంద్ర మోదీ , అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహన్, హర్దీప్ పూరి,స్మృతి ఇరానీ.

జేపీ నడ్డాలతో సహా అగ్రనేతలతో 20 బహిరంగ సభలతో,100కి పైగా సంస్థాగత సమావేశాల కు ప్రణాళిక రచించి, నిర్వహిస్తూ  ప్రచారాన్ని వేగవంతం చేసింది. అయితే ఢిల్లీ అ సెంబ్లీ ఎన్నికల్లో రెండు విరుద్ధమైన భావజాలాలను కలిగి ఉన్న పార్టీలు పోటీ పడు తున్నాయి. సాధారణ ప్రజల సంక్షే మం కోసం ఒకటి, సంపన్న వ్యక్తుల  కొమ్ముకాయడం కోసం రెండవది.

దీనికి భిన్నంగా కేవలం దేశ రాజధానిలో జరిగే పోటీ యా వత్ దేశానికి పోటీ అని, వైద్యం, విద్య, సం క్షేమం ఫోకస్‌గా ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. మఫ్లర్ వాలా వరసగా మూడోసారి ప్రజలను మెప్పించి  ప్రత్యక్ష ప్రయోజనాలు అందించేందుకు బురదను కడిగి ఒక విజన్ తో అధికారం దక్కించుకునేందుకు క్రేజీ తగ్గకుండా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది.

అలవికాని హామీలు

ప్రధాన పార్టీల అలవికాని హామీ లు, ప్రత్యర్థులకు అందని వ్యూహాలు,మేనిఫెస్టోలతో హోరెత్తితోంది. కేజ్రీవాల్ నేతృ త్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుజాడలను అనుసరించి ఎలాగైనా ఓటర్లలో పట్టు సాధించాలని బీజేపీ, కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. భారతీయ సమా జంలో మహిళలు ఒక ముఖ్యమైన భాగం, అత్యంత బలహీనమైన విభాగం కూడా. అందుకేనేమో ఈ ఎన్నికలు అబల చుట్టూ తిరుగుతున్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఢిల్లీ ప్రభుత్వం నెలకు రూ.1000 అందజేస్తోంది. తాము తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేస్తే  దీన్ని రూ. 2100కి పెంచుతామని హామీ ఇచ్చింది. మహిళలకు, విద్యా ర్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. మరో అడుగు ముందుకేసిన ఆప్ ఉచిత విద్యుత్, నీటిపథకం అద్దె దారులకు కూడా  అందిస్తా మని హామీ ఇచ్చింది. 

ఇదిలా ఉంటే ఉచితాలపై విమర్శలు చేసే బీజేపీసైతం  ఢిల్లీలో అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, గర్భిణీలకు పౌష్టిక ఆహారం అందజేస్తామని అలవికాని హామీ ఇచ్చింది. వితంతువుల పింఛన్ పెంచుతామని, మహిళలకు 21వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ హామీలను ప్రకటించింది.

ఆప్‌కు తామేమీ తీసిపోలేదనే విధంగా  ’ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలవారీగారూ. 2500 అర్థిక సాయం చేస్తామని, 25లక్షల ఆరోగ్య బీమా హామీ, 300 యూనిట్ల ఉచిత కరెంట్ లాంటి అలవిమాలిన హామీలు ఇచ్చింది.

ఉద్యమపార్టీకి అవినీతి బెడద

నిత్యం కాలుష్యంతో సతమతమవుతున్న పేద ప్రజలకు 25లక్షల ఆరోగ్య బీమా హామీ ఇచ్చింది. వరసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ కొత్త పార్టీ ఆప్ ఆవిర్భావంతో  స్థానభ్రంశం చెందింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి పుట్టిన కేజ్రీవాల్ పార్టీ 2013 ఎన్నికల్లో 29.5 శాతం ఓట్లతో 28 సీట్లు గెలుచుకుంది. హజారే నిరసనలకు కేం ద్రంగా ఉన్న న్యూఢిల్లీ ప్రాంతంలో ఆప్ అతిపెద్ద విజయాలు సాధించింది.

అక్కడ పది సీట్లలో ఏడు సీట్లు గెలుచుకుంది. బీజేపీ 31 సీట్లు, 33.1 శాతం ఓట్ల వాటా ను గెలుచుకుంది, కాంగ్రెస్ ఎనిమిది సీట్లు, 24.6 శాతం ఓట్లతో మూడవ స్థానానికి దిగజారింది. బీజేపీ  మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించ డంతో, కాంగ్రెస్ బయటి మద్దతుతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్‌ను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన జన్ లోక్‌పాల్ బిల్లును అమలు చేయడానికి తాను చేస్తు న్న ప్రయత్నాలను ఇతర రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ, 49 రోజుల తర్వాత,  2014,ఫిబ్రవరి 14న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు వరసగా అధికారం కట్టబెట్టిడంతో ఖంగుతిన్న బీజేపీ దాన్ని కూకటి వేళ్ళతో పీకాలని ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరెక్టరేట్ (ఈడీ)ని వా డుకుంది. బలమైన ఆధారాలతో 2024 మార్చి 21న ఆయనను అరెస్టు చేసింది. నిప్పు లేనిది పొగరాదు అన్నట్లు ఆప్ నాయకత్వంలో ఎక్కువమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా రు.

గత పదేళ్లుగా ఢిల్లీ పీఠం ఆప్ కౌగిళ్లలో ఉంది. కేజ్రీవాల్ పరిపాలన దక్షత, నిబద్ధతకు,కొలమానంగా హ్యాట్రిక్ దిశగా పయ నిస్తోంది.మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితం ఖంగారు పెట్టినా, ఢిల్లీ బాద్‌షా ఒంటి చేత్తో రెండు జాతీయ పార్టీలను చీపురుతో ఉడ్చాలని పటిష్టమైన ప్రణాళిక వేసి ముందుకు సాగుతున్నారు. గత 23 ఏళ్లుగా అధికారానికి ఉండడంతో 2025లోనైనా ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో కేంద్రం లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గల్లీకొక నాయకున్ని దించింది.

బీజేపీ బలం అంతాకూడా గత పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయంపై పెట్టుకున్న ఆశలే. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 36.56 శాతం ఓటు వాటాతో మొత్తం 7 స్థానాల్లో అఖండ విజ యం సాధించినందుకే అసెంబ్లీ ఎన్నికల్లో  కేజ్రీవాల్ హ్యాట్రిక్ నివారించాలని భావిస్తుంది. 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో  కాంగ్రెస్ బోణి కొట్టలేక చతికలప డింది. 2024లో దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కాం లో సహవాస దోషం వల్ల కేజ్రీవాల్ స్వయంగా ఐదు నెలల పాటు జైలు శిక్ష  అనుభవించారు.

ఆ సానుభూతితో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేజ్రీవాల్ ముందుకు సాగుతున్నారు. అయితే పోలింగ్‌కు అయిదు రోజుల ముందు ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కని వీరంతాఇన్ని రోజులు మౌనంగా ఉంటూ నే పోటింగ్‌కు ముందు రాజీనామా చేయ డం ఆప్ విజయావకాశాలపై గట్టి ప్రభావమే చూపవచ్చ   పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రాజీనామా చేసిన వీరంతా  ఏపార్టీలో చేర కున్నారో మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం. 

శత్రువు శత్రువు మిత్రుడు

‘శత్రువు శత్రువు మిత్రుడు’ అన్నట్లు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను మట్టికరిపించడానికి బీజేపీ,కాంగ్రెస్ మైత్రి కొనసాగిస్తున్నాయని కేజ్రీవాల్ బహిరంగంగా విమర్శిస్తు న్నారు. ఇండియా కూటమి భాగస్వాములైనప్పటికీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ ఓటమికి ఆప్ కారణమం టూ భావిస్తున్నందునే పొత్తు పొసగనందుకే కాంగ్రెస్, ఆప్ పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. 

అయితే సామాన్య ఓటర్లలో గట్టి పలకుబడి కలిగిన కేజ్రీవాల్ పార్టీని గద్దె దింపడం భారతీయ జనతా పార్టీకి అంత సులువు కాదని పరిశీలకుల భావన.ఆ పార్టీ నాయకుల భాషను బట్టే వారికి పరిస్థితులు సవ్యంగా లేవని జనానికి అర్థం అవుతోంది. దేశంలో ఓటర్లు తటస్థ పార్టీలకు స్నేహ హస్తం చాచుతున్నారా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓటర్ల తీర్పు ఏమిటో ఈ నెల 5న జరిగే పోలింగ్ తర్వాత 8న వెలువడే ఫలితాల్లో తేలనుంది.

 వ్యాసకర్త సెల్: 9866255355