28-04-2025 01:31:50 AM
ఆత్మనిర్భర్ స్పెషల్ పంచాయతీ కింద ఎంపికైన మాల్ గ్రామం సంత’కు 3 ఎకరాలు
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 27: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో సంతకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంత దేశవ్యాప్తంగా పశువుల వ్యాపారానికి కేరాఫ్ గా నిలిచింది. దశాబ్ద కాలంగా మాల్ పశువుల సంత అంటే రైతులకు ప్రత్యేక నమ్మకం. వ్యవసాయం, పాడి పశువులు దొరకాలంటే మాల్ సంతకెళ్లాల్సిందే.. తరతరాలుగా మాల్ సంతకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఇప్పుడు ఈ పశువుల సంత రాష్ట్రంలోనే ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డు దక్కించుకునీ, తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక గ్రామంగా ముద్ర వేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాచారం మండలంలోని మాల్ గ్రామం, ఒకప్పుడు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో చుట్టుపక్కల మండలాలైన చింతపల్లి, మర్రిగూడ, ఆమన్ గల్, కందుకూరు,
కడ్తాల్ మండలాల ప్రజలే కాకుండా, హైదరాబాద్, మాచర్ల, గుంటూ రు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఈ పశువుల సంతలో పశువులను అమ్మేందుకు, కొనేందుకు పెద్ద ఎత్తున వచ్చి, లావాదేవీలను జోరుగా సాగిస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం ఇక్కడ జరిగే పశువుల సంతతో పాటు వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతాయి. రోజు రూ.కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో పాటు వందలాది మంది ఉపాధి పొందుతారు.
క్రయ విక్రయాలు జోరుగా సాగుతుండ డంతో రూ.2 లక్షల నుంచి మొదలైన వేలం పాట, నేడు రూ.75 లక్షలకు చేరడం విశేషం. కానీ, మంచి ఆదాయ వనరుగా నిలుస్తున్న పశువుల సంతకు, సొంత స్థలం లేకపోవడంతో ప్రైవేటు వెంచర్లో నిర్వహణ కొనసాగిస్తున్నారు.
ఇందులో కనీస వసతులు లేక క్రయ విక్రయందారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంతకు వచ్చే మూగజీవాలకు కనీసం దాహం తీర్చేందుకు తాగునీరు, నీడ సౌకర్యం లేదు. సంత కొనసాగుతున్న పక్కనే సర్వే నంబర్ 640 లోని 16 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి 5 ఎకరాలు కేటాయించాలని 25 ఏళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు విజ్ఞప్తులు చేస్తున్నా నేటికి ఫలితం లేకపోయింది.
ఐదేళ్లుగా పశువుల సంతతో వచ్చిన రాబడి (రూ.లక్షల్లో) ఏడాది.. వచ్చిన ఆదాయం
2021 లో రూ.53,00,000
2022- లో రూ.59,00,000
2023- లో రూ.71,03,000
2024- లో రూ.73,00,000
2025- లో రూ.82,00,000
జాతీయస్థాయి గుర్తింపు భేష్...
గత నెల 19 అంశాల ప్రగతిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అవార్డులు అందజేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా, దీనికి ఎంపీడీఓ పంపిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సందర్శించి, మాల్ గ్రామాన్ని ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డుకు ఎంపిక చేసింది.
పశువుల సంత ద్వారా వచ్చే ఆదాయం కాకుండా పన్నుల వసూళ్లు, ఇతర అభివృద్ధి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునీ, అవార్డ్ తో పాటు, రూ.కోటి పారితోషికం ప్రకటించింది. జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంత’కు 3 ఎకరాలు..
మాల్ గ్రామపంచాయతీకి ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మాల్ పశువుల సంతకు, సొంత స్థలం లేకపోవడంతో క్రయ విక్రయదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయంపై ఎమ్మెల్యే రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, 3 ఎకరాలు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
గిరి గాలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు
జాతీయ అవార్డు.. అభినందనీయం
మెరుగైన రికార్డుల నిర్వహణ ఉన్న కేటగిరీలో మాల్ గ్రామం ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. రాష్ట్రంలోనే ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక గ్రామం మాల్ గ్రామం కావడం అభినందనీయం. వచ్చే రూ.కోటి తో మరింత అభివృద్ధి చేస్తాం.
నరేందర్ రెడ్డి, ఎంపీడీవో యాచారం