calender_icon.png 29 November, 2024 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో నేషనల్ గ్రీన్ హైవే రోడ్డు పనులు ప్రారంభం

29-11-2024 03:09:41 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం కన్నాల గ్రామపంచాయతీలోని పందులపల్లి గ్రామంలో శుక్రవారం నేషనల్ గ్రీన్ హైవే రోడ్డు పనులు ప్రారంభమైయ్యాయి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు భూ సేకరణ దాదాపుగా పూర్తి కావడంతో మంథని తాసిల్దార్  తో కలిసి సంబంధిత కాంట్రాక్టర్   జేసీబీతో పనులు మొదలుపెట్టారు. ఈ నేషనల్ హైవే  నాగపూర్ నుంచి కాగజ్ నగర్,  ఆసిఫాబాద్,  మంచిర్యాల్ జిల్లా మీదుగా పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం గోదావరి నది మీదుగా గూడు రేవుల, పోతారం గ్రామం మీదుగా నాగారం, కన్నాల పుట్టపాక, రామగిరి మండలంలోని రామయ్యపల్లి, లగ్నాపూర్, ఆదివారం పేట, నవాబ్ పేట మీదుగా, ముత్తారం మండలంలని శుక్రవారం పేట, లక్కారం, మైదాంబండ,  సర్వారం, పోతారం, కేశనపల్లి, ముత్తారం పోలీస్ స్టేషన్ వెనకాల నుంచి అడవి శ్రీరాంపూర్, ఓడేడు మానేరు వాగు పై మీదుగా భూపాల్ పల్లి జిల్లాకు రోడ్డు వేయనున్నారు.

ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు భూ నిర్వాసితులకు దాదాపు రూ. 20 లక్షల పైగా నష్టపరిహారం చెల్లించిన అధికారులు త్వరలోనే పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో మంథని ముత్తారం, రామగిరి మండలాలలో నేషనల్ హైవే రోడ్డు పనులు చక చక జరగనున్నాయి. ఈ రోడ్డు పూర్తి అయితే భూపాలపల్లి జిల్లా మీదుగా వరంగల్ హనుమకొండ, ఖమ్మం, విజయవాడకు,  రవాణా సౌకర్యాలు మెరుగు కానున్నాయి. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ లతోపాటు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది ముస్కుల సయేందర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.