calender_icon.png 3 April, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమిషాల్లో వాలిపోతూ.. ఊపిరి పోస్తూ

02-04-2025 12:42:04 AM

సకాలంలో స్పందించి క్షతగాత్రులను కాపాడుతున్న108 సిబ్బంది

ఎమర్జెన్సీ సమయంలో ఈఎంటీ మెరుగైన సేవలు

24 గంటల సేవలతో ఎందరికో మేలు

నేడు ఈఎంటీ దినోత్సవం

జనగామ, మార్చి 1(విజయక్రాంతి): ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాద జరుగుతుంతో తెలియదు.. ఏ క్షణాన ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో తెలియదు... విషయం తెలిసిన వెంటనే వారు ఘటనా స్థలిలో వాలిపోతుంటారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఎందరికో వారు ఊపిరి పోశారు. పురిటి నొప్పులతో తల్లడిల్లే గర్భిణులెందరినో సమయానికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. ఇలా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ప్రమాద బాధితులకు ప్రాణం పోస్తూ గొప్ప సేవలందిస్తున్నారు. ఏప్రిల్ 2న నేషనల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు జనగామ జిల్లాలో విస్తృత సేవలందిస్తూ ఎందరికో కొత్త ఆయుష్షు నింపుతున్నారు.

ప్రాణాపాయ పరిస్థితుల్లో సకాలంలో స్పందించి క్షతగాత్రుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. 108 వాహనాల ద్వారా ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎవరైనా అనారోగ్యంపాలైనా ఇట్టే వాలిపోతూ సమయానికి వారిని ఆస్పత్రుల్లో చేర్చడంలో వీరి పాత్ర అమోఘం. జనగామ జిల్లాలో పదకొండు 108 వాహనాల ద్వారా ఈఎంటీలు నిరంతరం సేవలందిస్తున్నారు. మొత్తంగా 22 మంది ఈఎంటీలు లు ప్రత్యేక శిక్షణ పొంది, వాహనాలలో ఉన్న అత్యాధునిక పరికరాలతో సేవలు అందిస్తున్నారు. ఈ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ప్రతీ రోజు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. 19 ఏళ్లుగా ఎన్నో ఎమర్జెన్సీ కేసులను చేధించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. క్షతగాత్రులకు అత్యవసర పరిస్థితులలో అవసరమైన వైద్యం అందచేసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిషన్స్ చేశారు. 

కాల్ వస్తే ఉరకడమే..

ఈఎంటీలో పనిచేసే 108 సిబ్బంది పనితీరు రిస్క్‌తో కూడుకున్నది. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ క్షణాన ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఘటనా స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి భోజనం చేద్దామని టిఫిన్ బాక్సు తెరిచి ముద్ద నోట్లో పెట్టకముందే ప్రమాద విషయం తెలిసిన వెళ్లిన సంఘటనలున్నాయని పలువురు సిబ్బంది పేర్కొన్నారు. తమ లక్ష్యం ఎమర్జెన్సీలో ఉన్న వారిని రక్షించడమేనని వారు చెబుతున్నారు. జనగామ జిల్లాలో గత 3 నెలల నుంచి వివరాలు చూస్తే.. జనవరిలో మొత్తం 1,250 ఎమర్జెన్సీ కేసులు రాగా.. అందులో 120 ప్రెగ్నెన్సీ, 96 రోడ్డు ప్రమాద బాధితులు, మిగిలిన వారు గుండెనొప్పి, శ్వాస సంబంధిత, పాముకాటు, రకరకాల రోగుల వారు ఉన్నారు.  ఫిబ్రవరిలో 1120 కేసులు నమోదు కాగా.. ఇందులో 110 మంది గర్భిణులు, 118 రోడ్డు ప్రమాద బాధితులు, మార్చి నెలలో 1380 కేసులు నమోదు కాగా.. 136 గర్భిణులు, 125 రోడ్డు ప్రమాద బాధితులు ఉన్నారు. జనవరి కొత్తగా జిల్లాకు నాలుగు అంబులెన్సులు మంజూరయ్యారు. వాటికి సంబంధించి లింగాలఘనపూర్ లో జనవరిలో 108, ఫిబ్రవరిలో 110, మార్చిలో 142,  నర్మెటలో 331, బచన్నపేటలో 372, చిల్పూర్ లో 288 ఎమర్జెన్సీ కేసులను ఈఎంటీలు సరైన సమయంలో చికిత్స అందిస్తూ ఆసుపత్రులకు తీసుకెళ్లారు.

ప్రాణాలకు లెక్క చేయకుండా పనిచేస్తాం..

మాది ఎమర్జెన్సీ ఫీల్డ్. చాలా రిస్కుతో కూడుకున్న పని. ఈఎంటీలు ప్రాణాలను లెక్కచేయకుండా సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తారు. ఎండాకాలంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు 108 వాహనాల్లో ఐస్ బాక్సులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, స్లున్లు అందుబాటులో ఉంచుతూ సేవలందిస్తున్నాము. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన సేవలు అందించడానికి 24 గంటలు అందుబాటులో ఉంటాం.

- మండ శ్రీనివాస్, 108 సర్వీసెస్ ప్రాజెక్ట్ మేనేజర్ , జనగామ