* భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
* మెదక్ జిల్లా తునికిలో రైతులతో ఆత్మీయ సమ్మేళనం
మెదక్, డిసెంబర్ 25(విజయక్రాంతి): రైతుల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని కృషివిజ్ఞాన కేంద్రాన్ని ఆయన తన సతీమణి డాక్టర్ సుదేశి దన్‌ఖడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి సందర్శించారు.
కేవీకేలో మొక్క నాటిన ఉపరాష్ట్రపతి అక్కడే ఏర్పాటు చేసిన సేంద్రీయ ఎరువులకు సంబంధించిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ సాగుపై రైతులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి చరిత్ర సృష్టించారన్నారు.
ఇక్కడి రైతులందరినీ మూడు రోజుల పాటు ఢిల్లీలోని తన స్వగృహానికి అతిథులుగా రావాల్సిందిగా ఆయన కోరారు. రైతులు మళ్లీ ఆర్గానిక్ సాగు దిశగా అడుగులు వేస్తున్నారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. రసాయనిక సాగును క్రమంగా తగ్గిస్తున్నారని, ఆర్గానిక్ సాగు చేస్తున్న 800 మంది రైతులు ఈ సమ్మేళనంలో పాల్గొనడం అనందంగా ఉందన్నారు.