23-03-2025 12:00:00 AM
కీలకోపన్యాసం చేసిన పలువురు ప్రముఖులు
రాజేంద్రనగర్, మార్చి 22 (విజయ క్రాంతి): ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం,డాక్టర్ ఎం.చెన్నారెడ్డి మెమోరి యల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం స్థానిక విస్తరణ విద్యా సంస్థ లో ప్రారంభం అయింది.
ఈ సదస్సు ని ఉద్దేశించి ఎన్ డీ ఎం ఏ మాజీ వైస్ ఛైర్మన్, డాక్టర్ ఎం.చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్ రెడ్డి కీలకోపన్యాసం చేశారు. రానున్న రోజుల్లో నీటి భద్రతకి వాటర్ షెడ్ విధాన సక్రమ నిర్వహణ పరిష్కారమని ఆయన అన్నారు. జల నిపుణుడు స్వర్గీయ టి.హనుమంత రావు ప్రవేశ పెట్టిన చతుర్విధ జల ప్రక్రియ అత్యుత్తమైనదని ఆయన అన్నారు.
ఈ ప్రక్రియ ని 2001 సంవత్సరం లో జహీరాబాద్ సమీపంలోని గొట్టిగారిపల్లిలో విజయవంతంగా అమలు చేశారన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం అమలులో క్షేత్ర స్థాయి సవాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పీజేటీఏయూ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం.బలరాం సూచించారు.రైతులని పూర్తి గా భాగస్వాములని చేసి వారికి నిరంతరం సలహాలు,సూచనలు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
నీటి సమర్ధ వినియోగం లో వాటర్ షెడ్‌లది కీలక పాత్ర అని విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డీన్ కేవీ రమణారావు అన్నారు.ఈ పథకం వల్ల సహజవనరుల పరిరక్షణ సాధ్యం అవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ సంచాలకులు డాక్టర్ కేపీ వాణి,వివిధ రాష్ట్రాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు, గొట్టిగారి పల్లి గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు.