* ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహణ
* హాజరుకానున్న అన్ని రాష్ట్రాల చైర్మన్లు
* టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ఈ ఏడాది డిసెంబర్‌లో హైదరా బాద్ వేదికగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. శనివారం బెంగళూరులో రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 25వ జాతీయ సదస్సు జరిగింది.
ఈ సమావేశానికి తెలంగాణ నుంచి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరు, అమలు చేస్తున్న విధానాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సుకు అన్ని రాష్ట్రాల చైర్మన్లు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
నియామకాలకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు, సబ్జెక్టు నిపుణుల నియామకానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. సదస్సు ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ గెహ్లాట్ హాజరై ప్రారంభించారు.