calender_icon.png 18 November, 2024 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ కమిషన్‌లను కలువనున్న లగచర్ల బాధితులు

18-11-2024 11:04:44 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): లగచర్ల బాధితులతో కలిసి ఢిల్లీలో వివిధ కమిషన్లను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం కలవనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్వాల మండలం లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో ఆదివారం ఢిల్లీ చేరుకున్నాయి.  ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తుండగా భూముల సేకరణకు నిర్వహించిన సభలో వికారాబాద్‌ కలెక్టర్‌పై రైతులు తిరగబడ్డ విషయం తెలిసిందే.

తిరుగుబాటులో పాల్గొన్న గిరిజన రైతులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన దారుణాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు కేటీఆర్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం 11 గంటలకు జాతీయ మహిళా కమిషన్, 11.45 గంటలకు జాతీయ మానవహక్కుల కమిషన్, మధ్యాహ్నం 12.30 గంటలకు జాతీయ ఎస్టీ కమిషన్, మధ్యాహ్నం 1.30 గంటలకు జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్లకు బాధితులు కలిసి తమ ఆవేదనను వెల్లడించనున్నారు.

లగచర్ల ఘటనపై కేటీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన కేటీఆర్‌ ఆదేశాల మేరకు లగచర్ల గిరిజన కుటుంబాలతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ ఢిల్లీ వెళ్లారు. ఆమెతోపాటు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీ సెల్‌ కో ఆర్డినేటర్‌ ఎల్‌ రూప్‌ సింగ్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు రామచంద్ర నాయక్‌, వాల్యా నాయక్‌, రాంబాల్‌ నాయక్‌ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు.