హైదరాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామస్తుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవాలని ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఫార్మాసిటీని ఏర్పాటు కోసం గొంతులేని లగచర్ల రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. లగచర్ల బాధితులు, బీఆర్ఎస్ నేతలు సోమవారం ఢిల్లీలోని మానవ హక్కులు, మహిళలు, షెడ్యూల్డ్ తెగలు, కులాలకు సంబంధించిన జాతీయ కమీషన్లను కలిసి వారి ముందు తమ బాధలను వ్యక్తం చేశారు. జాతీయ కమిషన్లు తమ విలువైన సమయాన్ని వెచ్చించి వారి బాధలను విన్నారు. ఈ వర్ణనాతీతమైన దురాగతానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనపై సానుకులంగా స్పందించిన అన్ని కమిషన్‌లకు ఫార్మా బాధితులు, బీఆర్ఎస్ నేతలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చీకటి కాలంలో ఎక్కడో ఆశ సజీవంగా ఉందని భావిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.