calender_icon.png 3 March, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి

01-03-2025 11:25:06 PM

వసూళ్లతో లక్షలు దండుకుంటూ పార్టీ పేరు పాడు చేస్తుండు.. 

నర్సారెడ్డి తప్పిదాలపై పీసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షికి ఫిర్యాదు చేస్తాం..

కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణం అతనే..

గజ్వేల్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి..

గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి భ్రష్టుపట్టిస్తున్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి, పలు మండలాల అధ్యక్షులు ఆరోపించారు. శనివారం గజ్వేల్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నర్సారెడ్డి నాయకత్వంలోనే 2009లో తాను కాంగ్రెస్ పార్టీ చేరి పార్టీకి అంకింతమై పనిచేస్తుండగా, 2014లో నర్సారెడ్డి బీఆర్‌ఎస్ ప్రలోభాలకు లొంగిపోయి ఆ పార్టీలో చేరాడన్నారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి బీఆర్‌ఎస్ కోవర్టుగానే పనిచేస్తూ 2023లో కాంగ్రెస్ పార్టీకి పక్కాగా ఉండే 30వేల ఓటు బ్యాంకును కూడా చెడగొట్టి డిపాజిట్ కూడా రాకుండా చేశాడని నాయిని యాదగిరి ఆరోపించారు.

పార్టీలో నర్సారెడ్డి లేని సమయంలోనూ పార్టీకి అంకితమై పనిచేసిన నాయకులను ఇప్పుడు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని, దీనివల్ల నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటేడ్ పోస్టులను అమ్ముకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క గ్రామానికి ప్రచారానికి వెళ్లకుండా నీలంమధు ఓటమికి నర్సారెడ్డి కారణమయ్యాడన్నారు. ఇష్టారీతిగా వసూళ్లకు పాల్పడుతూ పార్టీకి చెడ్డపేరుతు తీసుకువస్తున్న నర్సారెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని, సీఎం రేవంత్‌రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో బలహీనమవుతున్న కాంగ్రెస్ పార్టీనీ క్రమశిక్షణ చర్యలు చేపట్టి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నర్సారెడ్డి తప్పిదాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీనటరాజన్‌కు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా కేవలం స్వార్థ రాజకీయాలకే నర్సారెడ్డి పరిమితమయ్యాడని ఆరోపించారు. మనోహరాబాద్ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ... తనకు కోటి రూపాయలకు మార్కెట్ పదవి ఇస్తానంటూ లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఇప్పుడు మోసం చేస్తున్నాడన్నారు. తాను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరికి వెళతామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, పట్టణాధ్యక్షుడు మొనగారి రాజు. శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రావు, మామిడి కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్, తదితరులు పాల్గొన్నారు.