21-04-2025 01:29:10 AM
నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య పరిపాలన అవార్డు అందుకోనున్న జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అందరూ గర్వించదగ్గ అవార్డుకు ఎంపికైంది. ప్రగతి శీల బ్లాక్ ప్రోగ్రాం కేటగిరీలో భాగం గా ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం కు జిల్లా లోని నార్నూర్ బ్లాక్ 2024 సంవత్సరానికి గాను ఎంపికైంది. దేశంలో 426 ఆస్పిరేషనల్ బ్లాక్ లలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లీక్ భాగంగా నార్నూర్ అద్భుతమైన విజయాలను ప్రదర్శించి టాప్ 5 గా గుర్తింపును సాధించింది. దింతో సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఈనెల 21న భారత ప్రధాన మంత్రి మోది చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ అవార్డు అందుకొనున్నారు. ఈ దేశస్థాయి పురస్కారం పరిపాలన అభివృద్ధిలో అద్భుతమైన పనిని సొంతం చేసుకున్న వారికి ఇవ్వబడుతుంది.
ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి పనులపై పరిశీలిన చేస్తుంది. ఈ అవార్డు ప్రధానంగా ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతులలో కొలిచే పురోగతి పై దృష్టి పెట్టింది. అన్ని 5 ప్రధాన అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించినందుకు నార్నూర్ ప్రత్యేకంగా గుర్తించబడింది. వివిధ దశల సమగ్ర పరిశీలన తర్వాత, నార్నూర్ బ్లాక్ ఏబీపీ కింద టాప్ 5 బ్లాక్ గా ప్రకటించబడింది.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా కృషి ఎంతో ఉంది. ఆయన తన దూరదర్శితమైన నాయకత్వంతో అహర్నిశలు కష్టపడి క్రింది స్థాయి అధికారులకు దిశ నిర్దేశం చేస్తూ నార్నూర్ బ్లాక్ అద్భుతమైన మార్పు ప్రగతి సాధించడంలో జిల్లా కలెక్టర్ క్రియాశీలక పాత్ర ఉండడం మూలంగా ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రభుత్వ సహకారంతో పాటు, అనేక ఆసక్తిగల ఎన్జీఓలు తమ వంతు భాగస్వామ్యం చేయడం, వారు అందించిన సీఎస్‌ఆర్ ఫండింగ్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముఖంగా నార్నూర్ బ్లాక్ మరింత సుస్థిర అభివృద్ధి సాధించింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఆయా విభాగాల జిల్లా అధికారులు సంయుక్త సహకారంతో జిల్లా ఆస్పరేషనల్ నార్నూర్ బ్లాక్ సంబంధిత అధికారులు, అష్పరేషనల్ బ్లాక్ ప్రతినిధి రాహుల్, డివిజనల్, మండల, గ్రామ అధికారులు అందరి సమిష్టి, సహకారంతో అవార్డుకు ఎంపిక కావడం జరిగిందని అన్నారు. ఇదే స్పూర్తి తో తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాను అగ్రగామిగా నిలిచేందుకు మనందరం కలిసి కట్టుగా కృషి చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.