ప్రజాక్షేత్రంలోకి అల్ఫోర్స్ అధినేత
కరీంనగర్, సెప్టెంబరు 9 (విజయక్రాంతి): తెలంగాణ విద్యావేత్తగా పేరుగాం చిన అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో రావాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ వి నరేందర్‌రెడ్డి అంటే ఎవరికి తెలియదు. అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి అంటేనే అందరికి తెలుసు. విద్యాసంస్థ పేరే ఇంటి పేరుగా మారిపోయింది. టీచర్ స్థాయి నుంచి ఎదిగి తెలంగాణతోపాటు మహారాష్ట్రలో 56 అల్ఫోర్స్ విద్యాసంస్థలను నెలకొల్పారు.
ఇప్పుడు ఆయన నిజామాబాద్ పట్టభ ద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఏదై నా రాజకీయ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నా రా, ఒంటరిగా పోటీ చేస్తారా అన్నది ప్రకటించలేదు. అయితే అధికార పార్టీ అధిష్టానం మద్దతున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ అధిష్టానం పొన్నం ప్రభాకర్‌ను బరిలో నిలిపింది. మరోసారి గత కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ ముందస్తుగానే ఆశలు వదులుకున్నారు.
లక్ష ఎన్‌రోల్ లక్ష్యంగా..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే ఫిబ్రవరిలో జరగనుంది. పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించి ఈ నెలాఖరుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. అయితే ఇప్పటికే నరేందర్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డులో కార్యాలయం ఏర్పాటు చేశారు. వందమందితో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఈ టీం లక్ష మంది పట్టభద్రులను ఎన్‌రోల్ చేయడమే లక్ష్యంగా పనిచేయనుంది. పట్టభద్రులను సమీకరిస్తూ ఆత్మీయ సమ్మేళనాల్లో నరేందర్‌రెడ్డి పాల్గొంటూ ఓటరు జాబితాపై కసరత్తు చేస్తున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆయన పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తాటిపర్తి జీవన్‌రెడ్డి పదవీకాలం మార్చిలో ముగియనుండటంతో నరేందర్‌రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.