- పట్నంకు ఇంటి భోజనం అనుమతించండి
- జైలు అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ ప్రజాభిప్రాయ అధికారులపై దాడి కేసులో కీలక వ్యక్తి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డే అని దాఖలైన కేసులో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్‌రెడ్డిని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచాలని జైలు అధికారులను ఆదేశించింది.
ఇంటి నుంచి తీసుకొచ్చే భోజనాన్ని నరేందర్‌రెడ్డికి అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది. తన భర్తను నేరస్థులున్న ఇతర ఖైదీలతో కలి పి ఉంచడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి భార్య పట్నం శృతి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపి, ఉత్తర్వులు జారీ చేశారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాడి సాముల రవీందర్, గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై రైతులు చేసిన దాడిపై నమోదైన కేసులో అన్యాయంగా పిటిషనర్ భర్తను ఇరికించారని చెప్పారు. ఇతర నేర ఖైదీలతో కలిసి ఉంటే నరేందర్‌రెడ్డికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
నరేందర్‌రెడ్డిని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 15న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జైళ్ల శాఖ ఇన్స్‌పెక్టర్ జనరల్, చర్లపల్లి సూపరింటెండెంట్లకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ స్పందన లేదన్నారు. జైలు మాన్యువల్ ప్రకారం ఆ ముగ్గురు అధికారులు పిటిషనర్ భర్తకు జైల్లో ప్రత్యేక వసతి కల్పనకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
పిటిషనర్ భర్తకు ప్రాణహాని ఉన్నందున జైళ్ల చట్టం ప్రకారం ప్రత్యేక వసతి కల్పన చేసేందుకు జైలు అధికారులకు ఉత్తర్వులివ్వాలని కోరా రు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద పిటిషనర్ భర్త హక్కులను కాపాడాలని విజ్ఞప్తిచేశారు.
జీవించే హక్కును దెబ్బతీసేలా ఉన్న పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరారు. పిటిషనర్ భర్తకు ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేయాలని హైకోర్టు జైలు అథారిటీని ఆదేశించింది. అదే విధంగా పిటిషనర్ ఇంటి నుంచి తీసుకొచ్చే వంట పదార్థాలను నరేందర్‌రెడ్డికి రోజూ ఇవ్వాలని ఆదేశించింది.