ధరలు నియంత్రించాలని సెప్టెంబర్ 2న సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి.
సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
కరీంనగర్, (విజయక్రాంతి): గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో నరేంద్ర మోడీ వైఫల్యం చెందారని,తక్షణమే ధరల నియంత్రణ చేయాలని సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ శ్రేణులకు,ప్రజలకు సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటస్వామి మాట్లాడుతూ 2014 లో బిజెపి అధికారంలోకి రావడం కోసం నరేంద్ర మోడీ అనేక మాయమాటలు చెప్పారని,అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని అబద్ధాలు చెప్పారని ధరల నియంత్రణలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందినదని,2014 లో పెట్రోల్,డీజిల్ ధరలు తక్కువ ఉండేనని,పెట్రోల్ 60 రూపాయలు,డీజిల్ 70 రూపాయలు ఉండేదని నేడు డీజిల్ 100 పెట్రోల్ 110 దాకా చేరిందని ఇది పూర్తిగా మోడీ అసమర్థ పాలన కు నిదర్శనమని, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడం మూలంగా నిత్యవసర వస్తువుల సరుకులు సరఫరా చేసే వాహనాల కిరాయిలు పెరిగి వాటి ప్రభావం ప్రజల నిత్యావసర వస్తువులపై పడిందని, కేంద్ర ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా ఉల్లిగడ్డలు,ఎల్లిగడ్డలు,ఆలుగడ్డలు,పప్పులు,కూరగాయలు ఇలా అనేక రకాల వస్తువుల ధరలు పెరగడం వలన సామాన్య,మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల నియంత్రణపై అజమహిసి చేయడం లేదని అన్నారు.
రేషన్ కార్డుల ఈ కేవైసీ సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడం మూలంగా లక్షలాదిమంది అర్హులు నష్టపోతారని తక్షణమే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వెంకటస్వామి డిమాండ్ చేశారు. రాజకీయ అధికారంతో ప్రభుత్వ భూములు,చెరువులు, కుంటలు కబ్జా చేసిన వారిపై హైడ్రా నిర్వహిస్తున్న దాడులను రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని అభినందిస్తున్నామని, అత్యంత నిరుపేదలు ఇండ్ల జాగలు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుంటే వాటిని కూల్చుతున్నారని ఆ భూముల అమ్మిన వారిపై చర్యలు తీసుకొని ప్రత్యామ్నాయంగా వారందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో కుంటలు ,చెరువులు, ఎస్సారెస్పీ భూములు అక్రాంతం అయ్యాయని కొంతమంది అధికార దుర్వినియోగం చేసి ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని మధ్యతరగతి కుటుంబాల వారికి అమ్ముకొని కోట్లు గడిస్తున్నారని అన్నారు.
సర్వే నెంబర్లకు సహా ఏ కుంటలో ఎన్ని ఎకరాలు ఏ చెరువులో ఎన్ని ఎకరాలు భూమి ఉండేనని ఎంత భూమి అన్యాక్రాంతానికి గురైందనే విషయాలను తేల్చడానికి సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నామని 15 రోజుల్లో రిపోర్టు తయారు చేసి చేస్తామని, కరీంనగర్ లో కూడా హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని, అన్యాక్రాంతమైన భూములను నిరుపేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వెంకటస్వామి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్,కసిరెడ్డి సురేందర్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు నలువాల సదానందం,న్యాలపట్ల రాజు, కరీంనగర్ రూరల్ మండల కార్యదర్శి సాయవేని రాజమల్లు తదితరులు పాల్గొన్నారు