calender_icon.png 23 September, 2024 | 5:43 PM

ఎక్సైజ్ దాడుల్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

23-09-2024 01:21:28 AM

ఇద్దరి అరెస్ట్, మరో ఆరుగురిపై కేసు 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక వ్యక్తి నగరంలో చిరు వ్యాపారం చేస్తూ నష్టపోయాడు. దీంతో డ్రగ్స్ విక్రేత అవతారం ఎత్తాడు. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌లోని జాలర్ ప్రాంతానికి చెందిన సుశీల్‌కుమార్ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువుకు హైదరాబాద్‌కు వచ్చాడు. వ్యాపారం ఆశాజనకంగా లేకపోవడంతో ఇటీవల డ్రగ్ విక్రేతగా మారాడు.

ఆదివారం జాంబాగ్ పూల మార్కెట్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అతడితో పాటు దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి రూ. 1.62లక్షల విలువ గల 27గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుశీల్‌కుమార్ బెంగళూరులో ఉంటున్న ప్రవీణ్ సింగ్‌రావ్ సూచనతోనే అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకువచ్చాడని విచారణలో వెల్లడైంది. పోలీసులు సుశీల్‌కుమార్, దీపక్‌తో పాటు వారి వద్ద డ్రగ్స్ కొన్న హితేశ్, షేక్ మహమ్మద్, బాబీతో పాటు నిందితులకు సహకరించిన మరో ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు. 

గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్

హయత్‌నగర్ తొర్రూర్ క్రాస్‌రోడ్‌లో ఆదివారం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. మేడ్చల్ బొల్లారానికి చెందిన పసుపులేటి లోకేశ్ గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిండగా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.