calender_icon.png 17 November, 2024 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత

17-11-2024 02:10:20 AM

  1. గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో మృతి
  2. హైదరాబాద్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
  3. సంతాపం తెలిపిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

హైదరాబాద్, నవంబర్ 16 (విజయ క్రాంతి) : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేశారు. శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

సోదరుడి మరణవార్త తెలుసుకున్న సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. మంత్రి నారా లోకేశ్ కూడా అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు.

విషయం తెలుసుకున్న నారా, నందమూరి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. నారావారిపల్లిలో సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వారు ప్రకటించారు. కాగా రామ్మూర్తి నాయుడి మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 

రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవల ‘ప్రతినిధి హీరోయిన్ సిరి లెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లి నెలరోజుల్లో జరగనుండగా రామ్మూర్తినాయుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. 

* “నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను. రా మ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ లు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’    

 ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

* ‘చిన్నాన్న రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మా కంటికి కనిపించే ధైర్యం. నేటి నుంచి చిరకాల జ్ఞాపకం. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.’     

  ఏపీ మంత్రి నారా లోకేశ్

* ‘సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మరణించారని తెలిసి చింతిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నా. ఆయన కుమారుడు రోహిత్, కుటుంబసభ్యులకు నా సంతాపం తెలుపుతున్నా’.       

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

* ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నా. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవం తుడిని ప్రార్థిస్తున్నా’. 

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి