అమరావతి: జనవరి 23న ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో తన జన్మదిన వేడుకలు నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాసంస్థలను రాజకీయ ప్రభావం లేకుండా చూడాలని ఆయన ఒక పత్రికా ప్రకటనలో ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్(Zilla Parishad High School)లో విద్యార్థులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలిసి చాలా నిరుత్సాహానికి గురయ్యానని నారా లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లోకేశ్ అధికారులను కోరారు.