హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో జనవరి 1న ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(All India Industrial Exhibition) (నుమాయిష్) వాయిదా పడింది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి ఏడాది నుమాయిష్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జనవరి 1వ తేదీన ప్రారంభం కానున్న నుమాయిష్(Numaish), మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప దినాల నేపథ్యంలో రెండు రోజుల పాటు వాయిదా పడింది. జనవరి 3వ తేదీన పారిశ్రామిక వస్తు ప్రదర్శన(Industrial Exhibition) ప్రారంభం కానుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభించేందుకు నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. జనవరి 3వ తేదీన ప్రారంభమై 46 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగుతోంది. పారిశ్రామిక ప్రదర్శనకు దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణం చేసేందుకు నిర్వాహకుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్‌కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.
ప్రతి ఏడాది ఈ నుమాయిష్ ను దాదాపు 25 లక్షల మంది సందర్శిస్తారు. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు గాను అమ్యూజ్‌మెంట్ పార్క్ ఇలా అనేక స్టాళ్లు ఎగ్జిబిషన్‌లో అందుబాటులో ఉంటాయి. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మంత్రి శ్రీధర్ బాబు(Exhibition Society President and Minister Sridhar Babu) పర్యవేక్షణలో ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.