calender_icon.png 28 October, 2024 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీసీల పేర్లు ఫైనల్?

30-08-2024 01:27:22 AM

  1. వర్సిటీలవారీగా దాదాపు లిస్టు రెడీ! 
  2. సామాజికవర్గాలవారీగా ఎంపిక

ఇంకా ఖరారు కాని సెర్చ్ కమిటీ భేటీ తేదీలు

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పది ప్రభుత్వ యూనివర్సిటీలకు కొత్త వైస్ చాన్స్‌లర్ల నియామకానికి అభ్యర్థుల లిస్టు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఏ యూనివర్సిటీకి ఎవరిని నియమించాలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సామాజికవర్గాల వారీగా ఓ లిస్టును ఇప్పటికే రెడీ చేసినట్లు తెలిసింది. అయితే సెర్చ్ కమిటీల సమావేశాల తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

మొన్నటివరకు రాష్ట్రంలోని పెద్ద యూనివర్సిటీలైన ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీలకు వీసీలుగా ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జన పడిన ప్రభుత్వం.. ఈ మూడింటిపై కూడా తాజాగా ఓ నిర్ణయం తీసుకొన్నట్టు చర్చ జరుగుతోంది. వీసీల పేర్లు దాదాపు ఖరారైనా, వీసీల పేర్లను ప్రతిపాదించే సెర్చ్ కమిటీల సమావేశాల తేదీలు మాత్రం ఇంతవరకూ ఫైనల్ కాలేదు. ఈ సెర్చ్ కమిటీలు సమావేశమై పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. దీంతో ఎప్పుడు సెర్చ్ కమిటీలు సమావేశమవుతాయి అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.

తేదీలు కుదరక..

వీసీల పదవీకాలం ఈ ఏడాది మే 21తో ముగిసింది. ప్రస్తుతం ఐఏఎస్ అధికారులు ఇన్‌చార్జ్ వీసీలుగా వ్యవహరిస్తున్నారు. కొత్త వీసీల నియామకానికి మే 17వ తేదీనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను నియమించింది. పది యూనివర్సిటీలకు వేర్వేరుగా కమిటీలను నియమించింది. ఒక్కో వర్సిటీ సెర్చ్ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. అందులో యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ, యూనివర్సిటీ నామినీ ఉంటారు. అయితే సెర్చ్ కమిటీల భేటీకి రాష్ట్ర ప్రభుత్వ నామినీ, యూనివర్సిటీ నామినీలు రెడీగానే ఉన్నా.. యూజీసీ నామినీ సమయం ఇవ్వట్లేదని సమాచారం. వారికి అనుకూలమైన తేదీల్లో సమావేశాలను నిర్వహించాలని అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సమా వేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశమున్నది. 

ప్రతీ సామాజికవర్గానికి ప్రాధాన్యం

వీసీల పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. వీటికి ప్రభుత్వం గతంలోనే దరఖాస్తులను ఆహ్వానించింది. పది యూనివర్సిటీల నుంచి మొత్తం 1,382 దరఖాస్తులు రాగా, 320 మంది పోటీపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి 193, కాకతీయ వర్సిటీకు 149, పాలమూరు వర్సిటీకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీ వర్సిటీకు 157, తెలంగాణ వర్సిటీకు 135, జేఎన్టీయూకు 106, తెలుగు వర్సిటీకు 66, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ (ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ)కు 51, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి 208 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలించి ఒక్కో వర్సిటీ నుంచి ముగ్గురు పేర్లను ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తుంది.

ఈ జాబితాను గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపిస్తుంది. దాదాపు ప్రభుత్వం సూచించిన పేర్లనే గవర్నర్ ఆమోదిస్తారు. గవర్నర్ ఆమోదంతో వీసీల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఏ యూనివర్శిటీని ఏ సామాజిక వర్గానికి కేటాయించాలి? ఎవరైతే బాగుంటుందనే ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరికి ఇస్తే సామాజికంగా, రాజకీయంగా తమకు కలిసొస్తుందనే అంశాలను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందుకే వీసీల ఎంపికపై జాప్యం జరుగుతున్నట్లు చెప్తున్నారు.

పలువురు ఆశావహులు ఏకంగా తమ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ పెద్దలతో సిఫారసులు చేసుకున్నట్లు తెలిసింది. ప్రతీ సామాజికవర్గానికి సరైన ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. పది పదిహేను రోజుల్లో వర్సిటీలకు వీసీలను నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బిజీగా ఉన్నారు. గురువారంతో గవర్నర్ పర్యటన ముగియనుంది. ఆ తర్వాత సెర్చ్ కమిటీల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నది.